అట్ల ఎట్లా స్టేట్‎మెంట్ ఇస్తడు.. మెట్రో సీఎఫ్‎వోను లోపలేయుమన్న: సీఎం రేవంత్ 

= ఆయనది పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్ మెంట్ 
= హైదరాబాద్ లో మెట్రో ఉన్నది 69 కిలోమీటర్లే
= మహిళలకు ఉచిత బస్సు రాష్ట్రమంతా ఉన్నది
= ఫ్రీ బస్సు వల్ల మెట్రో రైల్ కు నష్టమెలా వస్తది
= రాజకీయ పార్టీతో కుమ్మక్కయి కాంగ్రెస్ 
   సర్కారును బద్నాం చేస్తుండు
= అజెండా ఆజ్ తక్ 2024 లో సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ‘మెట్రో సీఎఫ్‎వోను లోపలేయుమన్న.. ఆయన పొలిటికల్ మోటివేటెడ్ స్టేట్‎మెంట్ ఇచ్చారు.. అంతలోనే ఆయన ముంబై పారిపోయిండు.. హైదరాబాద్‎లో మెట్రో లైన్ ఉన్నది కేవలం 69 కిలోమీటర్లు.. మేం మహిళలకు ఫ్రీ బస్ రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నం. ఉచిత బస్సు కారణంగా మెట్రో  నష్టాల పాలవుతుందని ఎట్లా స్టేట్‎మెంట్ ఇస్తడు...? హైదరాబాద్‎లో ఎంత మంది మహిళలు మెట్రో వదిలి ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు.. మీరు హైదరాబాద్ రండి చూపిస్తా.. అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే స్టేట్‎మెంట్..’ అని తనదైన శైలిలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న రాత్రి ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్ తక్–2024 కాంక్లేవ్‎లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు సౌకర్యంపై అడిగిన ప్రశ్నకు ఘాటుగా సమాధానం చెప్పారు. 

మెట్రో సీఎఫ్‎వో ఏమన్నారంటే..?

ఈ ఏడాది మే నెలలో ఓ బిజినెస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్ అండ్ టీ సీఎఫ్ వో ఆర్ శంకర్ రామన్ మాట్లాడారు. బిజినెస్ ప్లాన్ లో భాగంగా హైదరాబాద్ మెట్రో వాటాలను అమ్మేయనున్నట్టు చెప్పారు. రోజుకు ఐదు లక్షల మంది మెట్రో సేవలను వినియోగించుకుంటారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్ జర్నీ పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీంతో మెట్రో నిర్వహణ భారంగా మారిందని ఎల్ అండ్ టీ సంస్థ చెబుతోంది. 

వాస్తవాలను పరిశీలిస్తే ఫ్రీ బస్ తర్వాత కేవలం రోజుకు 20 వేల మంది ప్రయాణికులు మాత్రమే తగ్గారు. దీనిపై అప్పుడే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామనే సాకుతో మెట్రో నిర్వహణను వదులుకుంటామంటే వేరొకరికి అప్పగిస్తామని చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యం విషయంలో వెనక్కు తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు. వాస్తవానికి మెట్రో సర్వీసుల్లో నిలుచునేందుకు కూడా జాగా ఉండటం లేదన్నది అందరికీ తెలిసిందే.

గత ప్రభుత్వం నుంచి అనేక రాయితీలు పొందిన ఎల్ అండ్ టీ సంస్థ మెట్రో నిర్వహణ నుంచి తప్పుకొనేందుకు ప్రయత్నిస్తుండటంపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు అంశం తెరమీదకు వచ్చింది. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలు కుంగిపోవడం, వాటిపై జ్యుడీషియల్ ఎంక్వైరీ మొదలు కావడంతో సర్కారును బ్లాక్ మెయిల్ చేసేందుకే ఎల్ అండ్ టీ అలాంటి స్టేట్ మెంట్ ఇచ్చిందనే చర్చ కూడా జరిగింది. 

దిగివచ్చిన ఎల్ అండ్ టీ  

హైదరాబాద్ మెట్రో స్టేట్ మెంట్ సీఎఫ్‎వో చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి అదే స్థాయిలో రియాక్ట్ అవడంతో ఆ కంపెనీ యాజమాన్యం దిగివచ్చిందని తమ తప్పును ఒప్పుకుందని సీఎం ఆజ్ తక్ కాంక్లేవ్‎లో చెప్పారు. తమ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ తప్పుడు స్టేట్ మెంట్ ఇచ్చారని ఒప్పుకున్నారని తెలిపారు. ఆ తర్వాత రెండో దశ పనులు మొదలయ్యాయి. రెండో దశలో 116.4 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్ కు సంబంధించిన ప్రక్రియ మొదలైంది.