ఎంఐఎం మాతోనే ఉంది.. ఆపార్టీతో కలిసి పాతబస్తీని అభివృద్ది చేస్తాం:సీఎం రేవంత్రెడ్డి

  • ఆరాంఘర్ ఫ్లైఓవర్కు మన్మోహన్ పేరు
  • ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన 
  • ఎంఐఎం మాతోనే ఉన్నది ఆ పార్టీతో కలిసి హైదరాబాద్​ను అభివృద్ధి చేస్తం 
  • ఓల్డ్ సిటీలో విద్యాసంస్థలు,ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తం 
  • మీర్ ఆలం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని వెల్లడి 

హైదరాబాద్​సిటీ, వెలుగు:హైదరాబాద్​లోని ఆరాంఘర్ ఫ్లైఓవర్​కు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరాంఘర్​ నుంచి జూపార్క్​వరకు రూ.499 కోట్లతో నిర్మించిన సిక్స్​లేన్ ​ఫ్లైఓవర్​ను సోమవారం ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.‘‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అతిపెద్ద ఫ్లైఓవర్ పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే నిర్మించుకున్నాం. ఇప్పుడు ఆరాంఘర్​ ఫ్లైఓవర్​ నిర్మించుకోవడం గర్వంగా ఉంది. ఇది రెండో అతిపెద్ద ఫ్లైఓవర్. దీనికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెడుతున్నాం” అని ప్రకటించారు.

 హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ కాదని, ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు. ‘‘ఎంఐఎం తెలంగాణలో కాంగ్రెస్​తోనే ఉన్నది. ఆ పార్టీతో కలిసి హైదరాబాద్​ను అభివృద్ధి చేస్తాం. అవసరమైతే -హైదరాబాద్​ అభివృద్ధి కోసం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్​తో కలిసి కేంద్రంతో కొట్లాడుతాం” అని చెప్పారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తన చిన్ననాటి స్నేహితుడని, ఓల్డ్ సిటీ అభివృద్ధి కోసం ఆయన అడిగిన పనులన్నింటికీ నిధులు మంజూరు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.  

ఓల్డ్ సిటీ డెవలప్ మెంట్ పై త్వరలో మీటింగ్..  

ఓల్డ్ సిటీ అభివృద్ధిపై స్థానిక ప్రజాప్రతినిధులతో త్వరలో సెక్రటేరియెట్​లో మీటింగ్ నిర్వహిస్తామని సీఎం రేవంత్​ తెలిపారు. ఆ ప్రాంతంలో విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ‘‘ఓల్డ్ సిటీలో గల్లీగల్లీ నాకు తెలుసు. 

సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట మీదుగా చాలాసార్లు ప్రయాణం చేశాను. పాతబస్తీలో మెట్రో రైలు, రోడ్ల విస్తరణ, శాంతిభద్రతల పరిరక్షణ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన వంటివి ప్రాధాన్యంగా పెట్టుకున్నామన్నారు. 

పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. కొద్ది రోజుల కింద మురుగు సమస్య పరిష్కారానికి చాంద్రాయణగుట్టలో సీవరేజీ పనులు ప్రారంభించాం” అని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం నగరంలో చిన్న వర్షం పడినా వరదలు వచ్చి ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రాబోయే కాలంలో ఆ పరిస్థితి లేకుండా చూస్తాం. రెండేండ్లలో మీర్ ఆలం చెరువుపై దుర్గం చెరువు మాదిరి కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తాం. గోషామహల్ స్టేడియంలో కొత్తగా ఉస్మానియా హాస్పిటల్ కడుతాం” అని తెలిపారు.  

ఓల్డ్​ సిటీలో ఐటీ టవర్స్: శ్రీధర్​బాబు 

హైదరాబాద్ అనగానే ముందు ఓల్డ్ సిటీ గుర్తుకొస్తుందని.. ఆ తర్వాతే సైబరాబాద్, ఇతర ప్రాంతాలు గుర్తొస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. ‘‘తాము నిర్మించిన ఫ్లైఓవర్ ను రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారని కొందరు బీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు. కానీ మేం వచ్చిన తర్వాతే సరైన టైంకు నిధులు విడుదల చేసి ఫ్లైఓవర్ పూర్తి చేశాం. ఓల్డ్ సిటీ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఓల్డ్​సిటీలో ఐటీ టవర్స్ నిర్మిస్తాం” అని ప్రకటించారు. 

మరిన్ని ఫైర్​ స్టేషన్లు కావాలి: అసదుద్దీన్ ​

ఓల్డ్ సిటీలో మరిన్ని ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ ​ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘‘నల్గొండ క్రాస్ రోడ్ వద్ద స్టీల్ బ్రిడ్జి పనులను వేగవంతం చేయాలి. యాకత్​పురాలో రోడ్డును విస్తరించాలి. మీరాలం మండిలో రానున్న మెట్రో స్టేషన్ నుంచి చార్మినార్ వరకు స్కైవాక్ ఏర్పాటు చేయాలి” అని ఎంపీ అన్నారు.  

బీఆర్ఎస్ చేసిందేమీ లేదు: అక్బరుద్దీన్  

ఓల్డ్ సిటీ అభివృద్ధికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘‘గత ప్రభుత్వం ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్, సింగపూర్ చేస్తామని చెప్పింది. కానీ కనీసం చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఓల్డ్ సిటీకి ప్రతిరోజు వేల సంఖ్యలో టూరిస్టులు వస్తారు. దీన్ని మరింత డెవలప్ చేస్తే టూరిజం పెరిగే అవకాశం ఉంది. 

ప్రభుత్వం తీసుకొస్తామంటున్న టూరిజం పాలసీలో మక్కా మసీదుతో పాటు ఇతర మసీదులను చేర్చితే బాగుంటుంది. ఓల్డ్ సిటీలో కూడా హై రైజ్డ్ అపార్ట్మెంట్ కల్చర్ వస్తోంది. ప్రభుత్వం కొత్తగా నిర్మించనున్న ఉస్మానియా దవాఖానపై దృష్టిసారించి త్వరగా పూర్తి చేయాలి” అని కోరారు. 

మెట్రో విస్తరణకు కేంద్రం సహకరించాలి.. 

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు కేంద్రం ఆర్థిక సాయం అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ‘‘మోదీ హయాంలో ఒక్క కిలో మీటర్ కూడా మెట్రో విస్తరణ చేపట్టలేదు. హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు కేంద్ర సర్కార్ సహకారం అందించాలి” అని విజ్ఞప్తి చేశారు. ‘‘చర్లపల్లి టెర్మినల్ ప్రారంభ సమయంలో ప్రధాని మోదీతో మాట్లాడాను. 

రీజినల్ రింగ్ రోడ్ కు అనుసంధానంగా రీజినల్ రింగ్ రైల్ కూడా కావాలని కోరాను. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే సిటీ మరింత డెవలప్ అవుతుంది. హైదరాబాద్ అభివృద్ధి కోసం మోదీతో కొట్లాడాల్సి వస్తే కొట్లాడుతా.. అసద్ తో కలవాల్సి వస్తే కలిసి ముందుకు వెళ్తా” అని చెప్పారు. హైదరాబాద్ మేయర్​గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ ఫ్లైఓవర్ ప్రారంభం నగర అభివృద్ధిలో మరో మైలురాయి అని పేర్కొన్నారు.