మార్చి నెలాఖ‌రు వరకు మెట్రోల డీపీఆర్లు పూర్తి చేయాలి : సీఎం రేవంత్ రెడ్డి

ఫ్యూచ‌ర్ సిటీ, శామీర్‌పేట్‌, మేడ్చల్ మెట్రోల డీపీఆర్‌లు  మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి  అధికారుల‌ను ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాత ఏప్రిల్ నెలాఖ‌రుకు టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం సూచించారు.హైద‌రాబాద్ లో మెట్రో విస్తరణ , రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాల‌పై సీఎం రివ్యూ చేశారు. 

రాజీవ్ గాంధీ  ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్  ,  ఫ్యూచ‌ర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్‌ - శామీర్‌పేట మెట్రో (22 కి.మీ.), ప్యార‌డైజ్ - మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని సీఎం సూచించారు. ఎలివేటెడ్ కారిడార్ల విష‌యంలో భవిష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకోవాలని... ఎలైన్‌మెంట్ రూపొందించేట‌ప్పుడే క్షేత్ర స్థాయిలో స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేయాలని ఆదేశించారు.

ALSO READ | హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్లో స్లీపింగ్ పాడ్స్.. ఏంటి వీటి ప్రత్యేకత?

మేడ్చల్  మార్గంలో ఎన్‌హెచ్ మార్గంలో ఇప్పటికే  ఉన్న మూడు ఫ్లైఓవర్లను  దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలి. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా  ప్రారంభించాలి. శామీర్‌పేట్‌, మేడ్చల్, మెట్రోలు ఒకే చోట ప్రారంభ‌మయ్యేలా చూసుకోవాలి. అక్కడ అధునాతన వ‌స‌తులు, భ‌విష్యత్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు భారీ జంక్షన్ ఏర్పాటు చేయాలి. జంక్షన్ కు  సంబంధించిన పూర్తి ప్రణాళికను  త‌యారు చేయాలి. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) కింద రేడియ‌ల్ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాలని అధికారులకు సూచించారు.