భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా రూ. 12 వేలు: సీఎం రేవంత్ రెడ్డి

భూమిలేని రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్రప్రభుత్వం. రాష్ట్రంలో భూమిలేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.  ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకింద ఏటా రూ. 12వేలు సాయం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే వ్యవసాయం చేయని భూములకు రైతు భరోసా ఇవ్వమని చెప్పారు. 

శనివారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రైతుభరోసా, రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా స్కీం అమలు చేస్తామని చెప్పారు. ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తోన్న వారికి సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. 2025, జనవరి 26వ తేదీ నుండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు లేని వారందరికి కొత్త కార్డులు జారీ చేస్తామని చెప్పారు.  

Also Read : జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం (జనవరి 4) రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో రైతు భరోసా విధివిధానాలకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రి మండలి సుధీర్ఘ చర్చించింది. దీనితో పాటు పలు కీలక నిర్ణయాలకు మంత్ర మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.