ఏపీలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీల హడావిడి

ఏపీలో ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ హీట్ పెంచుతున్నాయి. నోటిఫికేషన్ ప్రకటన సమయంలో.. సీఎం జగన్ అభ్యర్థుల ప్రకటన చేయనున్న సమయంలో.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీ గడ్డపై అడుగుపెడుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం.. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న సభకు.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. దీంతో ఏపీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని చాలా ప్రాంతాల్లో.. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లె్క్సీలు, బ్యానర్లు ప్రత్యేక ఆకర్షణగా మారడంతో జనంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది.

అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు వైజాగ్ జిల్లా కాంగ్రెస్ నేతలు తొలి ఎన్నికల సమావేశానికి సిద్ధమవుతున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖ తృష్ణా మైదానంలో  బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు  రేవంత్ హాజరవుతారు.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉక్కు డిక్లరేషన్ ప్రకటించనున్నారు.  ఈ బహిరంగ సభలో జాతీయ కాంగ్రెస్ నేతలతో పాటు  ఏపీసీసీ చీఫ్ షర్మిల, తెలంగాణ నేతలు కూడా పాల్గొననున్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ ఏపీ మ్యానిఫేస్టోను విడుదల చేసే అవకాశముంది.  రేవంత్ రెడ్డి రాకతో పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతుందని డీసీసీ అధ్యక్షుడు గొంప గోవిందరాజు  తెలిపారు. ఆయన  స్పీచ్, నిబద్ధత పార్టీ కార్యకర్తలను ప్రభావితం చేస్తాయన్నారు.