బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలి.. సీఎం రేవంత్ ఉగ్రరూపం

బీఆర్ఎస్ పదేళ్లలో చేయని పాపాలు లేవని సీఎం రేవంత్ రెడ్డి విరుచుపడ్డారు. పదేళ్ల పాలనలో పేద పిల్లల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. చేసిన పాపాలకు క్షమాపణలు చెప్పి, ముక్కు నేలకు రాయాలని తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. గురుకులాలను అస్తవ్యస్తంగా తయారు చేశారని, 10వ తరగతి పేపర్లను కూడా సరిగ్గా దిద్దలేక పోయారని మండిపడ్డారు. పదేళ్లలో గురుకులాల్లో ఆడ పిల్లలకు బాత్ రూమ్ లు కూడా కట్టలేక పోయారని అన్నారు. కోళ్ల ఫారంలో కోళ్లను కుక్కినట్లుగా విద్యార్థులను అద్దె భవనాల్లో ఉంచారని, సొంత భవనాలు కట్టలేక పోయారు. మీరు మాత్రం ఫామ్ హౌజ్ లు,  సెక్రటేరియట్, ప్రగతి భవన్ లు కట్టుకున్నాని విమర్శించారు. 

తాము వారిలాగ గజ్వేల్, ధన్వాడ ఫామ్ హౌస్ లు కట్టుకోలేదని చెప్పారు. 11.5 శాతం వడ్డీతో దొరికినన్ని అప్పులు చేశారని, మిగులు రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఘనత బీఆర్ఎస్ ది అని విమర్శించారు. తెలంగాణపై 7 లక్షల 11 వేల కోట్ల అప్పు ఉందని, వస్తున్న ఆదాయం తెస్తున్న అప్పులు బీఆర్ఎస్ పాపాలకే కడుతున్నామని, అందుకే పథకాలు ఆలస్యం అవుతోందని తెలిపారు. ఇన్ని అప్పులు లేకుంటే తెలంగాణలో అద్భుతాలు చేసేవాళ్లమని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని దారుణాలు చేసిన మీరా నా నిబద్ధతను ప్రశ్నించేది అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

రైతు భరోసా పై చర్చలో భాగంగా రాష్ట్ర అప్పులు, గత ప్రభుత్వం చేసిన అప్పులు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టిన మిత్తీలు మొదలైన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు. పదేళ్లలో అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ 27 వేల కోట్లు చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 27 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ  చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కేవలం 27 రోజులలో 17 వేల కోట్లు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఏడాదిలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం 20 వేల 616 కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు.