- కేసీఆర్ చుట్టపోళ్లకు పదవుల కోసమా యువత ప్రాణాలర్పించింది
- తెలంగాణ కోసం పోరాడిన నిరుద్యోగులను గత సర్కార్ పట్టించుకోలే
- నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పుకునెటోళ్లు ఎందుకు ఉద్యోగాలియ్యలే?
- నాడు వరి వేస్తే ఉరేనని రైతులను కేసీఆర్ తిప్పలు పెట్టిండు
- కాళేశ్వరం పేరు చెప్పి లక్ష కోట్లు దిగమింగిండు
- పదేండ్లలో మీరు చేసిందేందో.. ఏడాదిలో మేం చేసిందేందో చర్చిద్దాం
- 10 నెలల్లో 55,143 ఉద్యోగాల కల్పనతో దేశంలోనే తెలంగాణ రికార్డు
- గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు మోదీ ఎప్పుడైనా ఇట్ల ఇచ్చిండా? అని ప్రశ్న
- పెద్దపల్లిలో ఘనంగా యువ వికాస విజయోత్సవ సభ
కరీంనగర్ / పెద్దపల్లి, వెలుగు: మంచి పని కోసం కులగణన చేపడ్తుంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు పాల్గొనడంలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘మీరు ఈ రాష్ట్రంలో లేరా? బీసీలతో ఓట్లు వేయించుకోలేదా? మీరు బీసీ వ్యతిరేకులా? బీసీ ద్రోహులా?’’ అని నిలదీశారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన నిధులివ్వాలని, రిజర్వేషన్లు పెంచాలని అధికారికంగా కులగణన చేస్తుంటే సహకరించకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే చేపడ్తే రాజకీయ వైరుధ్యాలున్నప్పటికీ తాము పాల్గొన్నామని చెప్పారు.
ఇప్పుడు కులగణన పేరిట ప్రభుత్వం మంచి పని చేపడ్తుంటే సహకరించాల్సింది పోయి కేసీఆర్ శాపనార్థాలు పెడ్తున్నారని.. 80వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకునే ఆయనకు కులగణనలో పాల్గొనాలనే కనీస మర్యాద తెలియడం లేదని సీఎం విమర్శించారు. సమగ్ర కులగణనలో పాల్గొనని ఇలాంటి వాళ్లను సామాజిక బహిష్కరణ చేయాలని బీసీ సంఘాల నేతలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన ‘యువ వికాస విజయోత్సవ సభ’కు సీఎం రేవంత్ రెడ్డి హాజరై.. సుమారు వెయ్యి కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
గ్రూప్ 4 ఉద్యోగాలు సాధించిన 8,084 మంది అభ్యర్థులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు అందజేశారు. పలు కంపెనీలతో ఎంవోయూలు చేసుకున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. కులగణన కోసం బీసీలు ఎన్నో ఏండ్ల నుంచి కొట్లాడుతున్నారని, ఇప్పుడు తమ ప్రజా ప్రభుత్వం 95 శాతం దాన్ని పూర్తి చేసిందని తెలిపారు. ‘‘రాజకీయంగా వైరుద్యం ఉన్నా.. ప్రభుత్వం మంచి పనికోసం ముందుకు వచ్చినప్పుడు ప్రతిపక్షాలు అనుకూలంగా వ్యవహరించాలి.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు, వినోద్‌రావు కులగణనలో ఎందుకు పాల్గొంటలే? దేశం మొత్తం కులగణన చేసే విధంగా తెలంగాణలో చేపడ్తుంటే పెద్ద మనుసుతో అభినందించాల్సింది పోయి కేసీఆర్ శాపనార్థాలు పెడ్తున్నడు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్లలో రైతులకు గిట్టుబాటు ధర రాలేదని, కానీ కేసీఆర్ గజ్వేల్ లోని పొలంలో ఎకరాకు రూ.కోటి రూపాయలు సంపాదిస్తున్నట్లు చెప్పారని పేర్కొన్నారు. ఎకరాకు రూ.కోటి పంట ఎట్ల తీయొచ్చో తెలంగాణ రైతాంగానికి పదేండ్లయినా కేసీఆర్ నేర్చించలేదని.. ఆ విద్య ఏందో, ఆ మహత్య్మం ఏందో చెప్పలేదని ఆయన విమర్శించారు.
పది నెలల్లో 55 వేల ఉద్యోగాలు.. దేశంలోనే రికార్డు
‘‘ఆనాడు 1,200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నది.. నెలల కొద్దీ రాస్తారోకోలు చేస్తూ, వంటావార్పులు చేస్తూ నిరసన తెలిపిందీ ఎందుకోసం? తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయనే కదా! తెలంగాణ ఉద్యమమే ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం జరిగింది. పదేండ్లు బీఆర్ఎస్అధికారంలో ఉన్నా నిరుద్యోగులను పట్టించుకోలేదు. పదేండ్ల తర్వాత ఒక్క సంవత్సరంలోనే 55,143 ఉద్యోగాలను నిరుద్యోగులకు మేం అందజేశాం. ఏడాదిలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రంగా దేశంలో తెలంగాణ రికార్డు సృష్టించింది.
Also Read : వచ్చేది మా సర్కారే.. మీ సంగతి చెప్త
ఇప్పుడు గ్రూప్ 4 ఉద్యోగాలు 8,084 మందికి ఇచ్చాం” అని సీఎం వివరించారు. అప్పట్లో గుజరాత్‌కు సీఎంగా పనిచేసిన నరేంద్రమోదీ ఏ ఒక్క సంవత్సరమైనా ఆ రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు ఇచ్చారా? అని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌ని ప్రశ్నించారు. ‘కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు సవాల్ విసురుతున్న..! మా నిరుద్యోగ యువతను తీసుకుని గుజరాత్ కు వస్తం. మీరు అధికారిక కార్యక్రమం ఏర్పాటు చేయించండి. చర్చ చేద్దాం. లేదంటే మీ నాయకుడు నరేంద్ర మోదీని ఆహ్వానిస్తున్నం. ఆయనకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తం. వారిని రమ్మనండి. సెక్రటేరియెట్‌లో చర్చ పెడ్దాం” అని సవాల్ విసిరారు.
మేం కట్టిన ప్రాజెక్టులెట్లున్నయి.. కాళేశ్వరం ఎట్లుంది..!
కాళేశ్వరం కట్టినమని చెప్పి లక్ష కోట్లు కేసీఆర్ దిగమింగారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ‘‘ఇక్కడి నుంచి కూతవేటు దూరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల కట్టుడేందో.. కూలుడేందో.. ” అని విమర్శించారు. రూ.లక్షా 2 వేల కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయిందన్నారు. ‘‘గతంలో కాంగ్రెస్ హయాంలో కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల, శ్రీరాంసాగర్, నెట్టెంపాడు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఎట్లున్నయో.. నువ్వు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఇవాళ లెక్కలు తీద్దామా కేసీఆర్!” అని సీఎం సవాల్ చేశారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు లేకపోయినా కోటి 53 లక్షల టన్నుల వడ్లు పండించామని, కనీస మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇచ్చామని తెలిపారు.
ఆ రోజు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయమంటే.. రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని కేసీఆర్ చెప్పిండు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని, మీకు మాకు సంబంధం లేని బరితెగించి, తెగబడి కేసీఆర్ మాట్లాడిండు. ఈ రోజు మేం సన్నాలు పండించండి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఇస్తున్నం. కేసీఆర్ ఎగ్గొట్టిన రూ.7,625 కోట్ల రైతు బంధును ఇచ్చినం. 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్లు విడుదల చేసి పది నెలల్లో రూ.2 లక్షల్లోపు రుణమాఫీ చేసి చరిత్రను తిరగరాసినం” అని ఆయన వివరించారు.
కేసీఆర్..! మీ పిల్లలకు ఉద్యోగాలుంటే సరిపోతదా?
‘‘మీ కుటుంబంలో వినోద్ కుమార్ ఎంపీగా ఓడిపోతే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా ఇస్తివి. కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి పదవులు ఇస్తివి. నీకు, నీ చుట్టపోళ్లందరికీ మంత్రి, ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులు ఇచ్చుకుంటివి. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని పోరాడిన నిరుద్యోగుల పరిస్థితి ఏంది? వాళ్ల గురించి ఒక్కసారైనా ఆలోచించినవా?” అని కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు. ‘‘మీ పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి కానీ.. పేదోళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఉండొద్దా? కేవలం ఒక కుటుంబాన్ని అందలమెక్కించడానికి తెలంగాణను తెచ్చుకున్నమా? నోటిఫికేషన్లు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నేతలు ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘తండ్రి, కొడుకు, అల్లుడు పొద్దున లేస్తే మా ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నరు. శాపనార్థాలు పెడ్తున్నరు. వాళ్ల బాధకు, వాళ్ల దు:ఖానికి కారణమేందో అర్థమైతలేదు. కొత్త బిచ్చగాళ్ల మాదిరి తలా ఓ దిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పనిచేయనీయకుండా అడ్డుకుంటున్నరు. ఇది ఎందుకు చేస్తలేరు.. అది ఎందుకు చేస్తలేరు.. అంటూ చిల్లర మాటలు మాట్లడ్తున్నరు. పదేండ్లు మీరే అధికారంలో ఉన్నరు కదా? ఎందుకు చేయలే! 80 వేల పుస్తకాలు చదివిన అపరమేధావులు కదా మీరు? సమస్యలు ఎందుకు పరిష్కరించలే. ఐదేండ్ల కోసం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే వీళ్లు ‘దిగిపో.. దిగిపో’ అంటున్నరు.
మేం ప్రతిపక్ష నేతలుగా ఏనాడైనా ఇట్లా చేసినమా? జానారెడ్డి, భట్టి విక్రమార్క నాడు మీ ప్రభుత్వానికి సహేతుకమైన సూచనలు, సలహాలు ఇచ్చిన్రు తప్ప మీ మాదిరి ఏనాడూ చిల్లర రాజకీయాలు చేయలె” అని బీఆర్ ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. ఒక్కరోజులో అద్భుతాలు చేయలేమని, ఐదేండ్ల తర్వాత తమ పనులను చూపి ప్రజల్లోకి వెళ్లి మరో ఐదేండ్లు అవకాశం ఇవ్వాలని అడుగుతామని చెప్పారు. అంతవరకు మీకు ఓపిక లేదా? అని బీఆర్ఎస్ నేతలను సీఎం రేవంత్‌రెడ్డి నిలదీశారు.
ఆదర్శంగా కాకా కుటుంబం
కేంద్ర మాజీ మంత్రి, పేదల పెన్నిది కాకా వెంకటస్వామి కిందిస్థాయి నుంచి రాజకీయంలో ఎంతో ఎత్తుకు ఎదిగారని పెద్దపల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘ఒక వ్యక్తి ప్రయోజకుడైతే వారి కుటుంబం తరతరాలు ఉన్నతంగా ఎదుగుతుందనడానికి కాకా కుటుంబమే నిదర్శనం. వెంకటస్వామి కుమారుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇటు రాజకీయ రంగంలోనూ, అటు వ్యాపార రంగంలోనూ చక్కగా రాణిస్తున్నారు.
అలాగే మీడియా రంగంలోనూ అత్యుత్తమంగా రాణిస్తున్నారు. వివేక్, వినోద్ తోపాటు ఎంపీగా వంశీకృష్ణ ప్రజలకు సేవ చేస్తూ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారు” అని ఆయన పేర్కొన్నారు. ‘‘పేదవాడు చదువుకున్నప్పుడే భవిష్యత్ ఉంటుంది. ఉపాధి ఉద్యోగం వస్తే ఒకతరం బాగుంటుంది. అందుకే పట్టుబట్టి పోటీ పరీక్షలు పెట్టి ఎవరు అడ్డుపడ్డా, కొందరు కృతిమ ఉద్యమాలు చేపట్టినా వారిని పిలిపించి మాట్లాడుతున్నం. 55 వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకం చేపట్టి భారతదేశ చరిత్రలోనే చరిత్ర తిరగరాసినం” అని వివరించారు.
పెద్దపల్లికి మరిన్ని పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు: ఎంపీ వంశీకృష్ణ
గత పదేండ్లు పెద్దపల్లిని దోచుకుతిన్నరు గానీ పైసా పనిచేయలేదని బీఆర్ఎస్ నేతలపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మండిపడ్డారు. ‘‘పెద్దపల్లి ప్రాంతంలో వనరులు ఎక్కువ.. పంట పండుతుంది.. సింగరేణి ఉంది. కానీ.. నిధుల్లేవు, నియామకల్లేవు. ఒక్క సంవత్సరంలోనే వెయ్యి కోట్ల నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. గత పదేండ్లు రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంరూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిపోయింది. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ప్రజలకు మాట ఇచ్చినందుకు ఆరు గ్యారంటీలను ఎలాగైనా అమలు చేయాలని సీఎం రేవంత్ బాధ్యత తీసుకున్నారు.
సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు మా ఎంపీలందరిని కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకుకెళ్లి నిధుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. రామగుండం ఏరియాలో మంచి ఫెసిలిటీస్‌తో ఎయిర్ పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాది. ఎన్టీపీసీ విస్తరణకు కృషిచేస్తాం. స్థానిక యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది. అనుబంధ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడి యువతకు ఉద్యోగాలిస్తామని ఎన్నికల సమయంలో చెప్పాం. కచ్చితంగా త్వరలోనే మీకు(ప్రజలకు) మంచి వార్త చెప్తాను” అని ఆయన పేర్కొన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తం
ప్రజా ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆడబిడ్డలకు జీరో వడ్డీ రుణాలిస్తున్నం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని కంకణం కట్టుకున్నం. ఈ సారి 92 లక్షల మంది ఓట్లేస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది.. వచ్చేసారి కోటి మంది ఆడబిడ్డలు ఓటేస్తే.. మా సోదరులు వేసే ఓట్లు బోనస్ అవుతాయి” అని సీఎం పేర్కొన్నారు. వర్సిటీలను కేసీఆర్ నాశనం చేశారని.. వీసీలను, స్టాఫ్‌ను నియమించలేదని తెలిపారు. తాము వచ్చాక 10 యూనివర్సిటీలకు వీసీలను నియమించడంతోపాటు స్కూళ్లలో టీచర్ల నియామకాలు చేపట్టామని పేర్కొన్నారు. శాతవాహన యూనివర్సిటీ వీసీ విజ్ఞప్తి మేరకు ఇంజనీరింగ్ కాలేజీ, లా కాలేజీ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
కేటీఆర్, హరీశ్‌ను ఊరిమీదికి వదిలిండు
కేసీఆర్ ఇంట్ల పండుకున్నడు. గ్రామాల్లో మైసమ్మకు మొక్కి పోతులను ఇడ్సిపెట్టినట్లు అచ్చం అట్లనే కేటీఆర్, హరీశ్ రావును ఊరిమీదికి వదిలిండు. అచ్చోసిన ఆంబోతుల్లెక్క తిరుగుతూ ఏం మాట్లాడుతున్నరో వాళ్లకే తెలుస్తలేదు. పదేండ్లు వాళ్లు చేసింది ఏంది.. ఏడాదిలో మేం చేసింది ఏమిటో అసెంబ్లీలో చర్చిద్దామంటే రాకుండా కేసీఆర్ రాళ్లు విసురుతున్నడు.. చెట్లల్ల దాక్కుంటున్నడు.
సీఎం రేవంత్ రెడ్డి
స్థానిక యువతకు ఉద్యోగాలిస్తం
పెద్దపల్లి ప్రాంతానికి ఒక్క ఏడాదిలోనే వెయ్యి కోట్ల నిధులు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. గత పదేండ్లు రాష్ట్రం ఆర్థికంగా చాలా నష్టపోయింది. సీఎం ఢిల్లీకి వచ్చినప్పుడు మా ఎంపీలందరిని కేంద్ర మంత్రుల దగ్గరికి తీసుకెళ్లి నిధుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. రామగుండం ఏరియాలో మంచి ఫెసిలిటీస్‌తో ఎయిర్ పోర్టు తీసుకొచ్చే బాధ్యత మాది. ఎన్టీపీసీ విస్తరణకు కృషి చేస్తాం. స్థానిక యువతకు ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది. ఎంపీ వంశీకృష్ణ
శ్మశానవాటికలు కట్టి అభివృద్ధిగా చూపించారు: భట్టి
ఈజీఎస్ నిధులతో గ్రామాల్లో శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు కట్టి.. పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపెట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ‘‘బీఆర్ఎస్ నాయకత్వం కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బురద జల్లే పని చేస్తున్నది. మేం అధికారంలోకి వచ్చింది ప్రజల కోసం పని చేయడానికి. మీలాగా ప్రచారం చేసుకోవడానికి కాదు. సీఎంతోపాటు మంత్రులంతా రోజుకు 18 గంటలు పని చేస్తున్నం.
రూ.21 వేల కోట్ల రుణమాఫీ చెల్లించాం. కాళేశ్వరం వల్లే పంట పండిందని నిన్నటి వరకు ప్రగల్భాలు పలికారు కాదా? కానీ కాళేశ్వరం లేకపోయినా అత్యధికంగా రికార్డు స్థాయిలో పంట పండించాం. బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఉద్యోగం ఇయ్యలేదు. మేం 10, 11 నెలల్లో 55 వేల మందికి నియామక పత్రాలు ఇచ్చాం. ఇది అషామాషీ కాదు. 65 టెక్నాలజీ అడ్వాన్స్ సెంటర్లు పెట్టి నిరుద్యోగ యువతకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. సింగరేణి కార్మికులకు ప్రమాదవశాత్తూ ఏమైనా జరిగితే రూ.కోటి ఇన్సూరెన్స్ చేయించడం దేశ చరిత్రలోనే ఎక్కడ జరగలేదు. బస్టాండ్ కూడా లేని పెద్దపల్లి అసెంబ్లీకి రూ.1500 కోట్ల అభివృద్ధి పనులు ప్రారభించాం” అని ఆయన వివరించారు.
అందరి కష్టఫలితమే ఇందిరమ్మ రాజ్యం: మంత్రి పొంగులేటి
మనందరి కష్టం ఫలితంగానే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతోపాటు అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ మొదటి ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు.
ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇండ్లు అని, డిసెంబర్ 5న సీఎం, మంత్రివర్గ సహచరుల సమక్షంలో ఇందిరమ్మ ఇండ్ల యాప్ ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. మొదటి దఫా కింద ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. రాబోయే 4 ఏండ్లలో రూ.లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. అర్హులైన పేదలందరికీ రాజకీయాలు, కులాలకతీతంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు. డిసెంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని చెప్పారు.
ఏడాదిలోపే 55,143 ఉద్యోగాలిచ్చినం: వెంకట్‌రెడ్డి
ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోపే 55,143 ఉద్యోగాలు భర్తీ చేశామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది ముగిసిన నేపథ్యంలో విజయోత్సవాలు జరుపుతున్నామని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేశామని, సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంతోపాటు పెద్దపల్లి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు స్థానిక నాయకులతో కలిసి పని చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు.
కులగణన చేపట్టి దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు రూ.710 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు, మంథనిలో గోదావరి నది పై హై లెవెల్ బ్రిడ్జి , రింగ్ రోడ్డు వంటి ముఖ్యమైన పనులను మంజూరు చేశామని పేర్కొన్నారు.
దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ: మంత్రి తుమ్మల
దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ ఆవిర్భవించిందని, పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా వరి సాగవుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు మొదటి ఏడాదినే రైతుల సంక్షేమానికి రూ.55 వేల కోట్లను ఖర్చు చేసినట్టు చెప్పారు. రూ.2లక్షల రుణమాఫీ కింద 25 లక్షల రైతు కుటుంబాలకు వారి ఖాతాల్లో రూ.21 వేల కోట్లను జమ చేశామని తెలిపారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశామని వెల్లడించారు. సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కు రూ.500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా బాధ్యత మనందరిది: పొన్నం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసుకునే బాధ్యత మనందరిదని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వేములవాడ ఆలయం మాదిరిగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి, కొండగట్టు ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో ఎయిర్ పోర్ట్ మంజూరు అయ్యేలా కృషిచేస్తామని తెలిపారు. ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొని రావాలన్నారు.
పదేండ్లలో టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టలే: మంత్రి ఉత్తమ్
గత పదేండ్లలో టీచర్ రిక్రూట్మెంట్ జరగలేదని మంత్రి ఉత్తమ్ కుమా ర్ రెడ్డి అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన 11 నెలల్లోనే 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఏడాదిలో నే 55 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసినట్టు చె ప్పారు. యువ వికాస కార్యక్రమంలో 9 వేల మందికి నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో రాష్ట్రా నికి రూ.వేల కోట్ల పెట్టుబడులతో.. ప్రైవేట్ రంగంలో లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.
అభివృద్ధి చేసి చూపుతున్నం: మంత్రి శ్రీధర్ బాబు
ప్రభుత్వం ఏర్పాటైన ఏడాదిలోనే ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సిన రోడ్లు, డ్రైయిన్లు, కమ్యూనిటీ హాల్స్‌ను నిర్మించామని చెప్పారు. యువకుల పోరాటంతో సాధించిన తెలంగాణ గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైందని తెలిపారు. ఏడాదిలోనే రికార్డు స్థాయిలో 55,143 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రానికి బస్సు డిపో కలను ప్రజా ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు. పెద్దపల్లి పట్టణ వాసుల కోరిక మేరకు రూ. 82 కోట్లతో బైపాస్ మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని చెప్పారు. సింగరేణి సంస్థ ద్వారా రూ. 23 కోట్లతో రామగుండంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. రూ.26 కోట్లతో నర్సింగ్ కళాశాల పనులకు శంకుస్థాపన చేశామని చెప్పారు.