దేశానికి హైదరాబాద్​​ రోల్​ మోడల్ 

  • ప్రపంచ నగరాలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతం : సీఎం రేవంత్​
  • గొప్ప పనులు సాధించాలంటే రిస్క్​ తప్పదు.. జీవితం, రాజకీయాల నుంచి ఎంతో నేర్చుకున్న
  • రాష్ట్రాన్ని ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే తమ లక్ష్యమని వెల్లడి
  • ఐఎస్​బీ లీడర్​షిప్​ సమిట్​కు హాజరు

హైదరాబాద్​, వెలుగు : దేశానికి రోల్​మోడల్​గా హైదరాబాద్​ను తీర్చిదిద్దాలన్నదే తమ ఆలోచన అని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు.  దేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్​ పోటీ పడాలని తాము అనుకోవడంలేదని.. ప్రపంచలోని న్యూయార్క్​, లండన్​, పారిస్​, టోక్యో, సియోల్​ వంటి నగరాలతో పోటీపడాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘‘ప్రపంచంలోనే ఇండియా, హైదరాబాద్​ అత్యుత్తమంగా ఎదగాలన్నది పెద్ద లక్ష్యమే. అది కష్టమైనదే కావొచ్చు. కానీ.. అసాధ్యం మాత్రం కాదు” అని పేర్కొన్నారు. గొప్ప పనులు సాధించాలంటే రిస్క్​ చేయక తప్పదని..

పోరాటంలో ఎన్నో కోల్పోవాల్సి ఉంటుందని అన్నారు. జీవితం, రాజకీయాల నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఆదివారం హైదరాబాద్​లోని ఇండియన్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్ (ఐఎస్​బీ)​లో నిర్వహించిన ఐఎస్​బీ –2024 లీడర్​షిప్​ సమిట్​లో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు.ఐఎస్​బీ విద్యార్థులు హైదరాబాద్​, తెలంగాణ, న్యూ ఇండియాకు బ్రాండ్​ అంబాసిడర్లని పేర్కొన్నారు. ‘‘తెలంగాణను ఒక ట్రిలియన్​ డాలర్ల జీడీపీ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్​ను 600 బిలియన్​ డాలర్ల సిటీగా మార్చాలి.

రాష్ట్రాన్ని ప్రపంచంలోని ప్రతి మూలకూ తీసుకెళ్లేందుకు నాకు మీ సాయం కావాలి. మీరంతా ఎక్కడికెళ్లినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, సామాన్య ప్రజలతో తెలంగాణ, హైదరాబాద్​ గురించి చర్చించండి. మీరు పెద్ద పెద్ద సంస్థలు, అంతర్జాతీయ సంస్థల్లో మంచి జీతంతో ఉద్యోగాలు సంపాదించొచ్చు. కానీ, ఎప్పుడో ఒకసారి కనీసం రెండు మూడేండ్లయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. కార్పొరేట్​ సంస్థల్లాగా పెద్ద జీతాలను ఇవ్వలేకపోయినా.. మీలాంటి అత్యంత నైపుణ్యం కలిగిన వారికి మంచి అవకాశాలు అందించేందుకు సిద్ధంగా ఉంటం’’

అని ఐఎస్​బీ స్టూడెంట్లతో సీఎం అన్నారు. సౌత్​ కొరియా లాంటి ఓ చిన్న దేశం మొన్న ఒలింపిక్స్​లో అనేక పతకాలను సాధించిందని, మన దేశం ఒక్క బంగారు పతకాన్ని కూడా గెలవలేకపోయిందని సీఎం రేవంత్​రెడ్డి పేర్కొన్నారు.  తమ లక్ష్యం మనం ఎక్కువ పతకాలను సాధించడమేనని.. అందుకే సౌత్​ కొరియాలో ఉన్నటువంటి స్పోర్ట్స్​ యూనివర్సిటీ లాగానే గచ్చిబౌలిలోనూ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇటు స్కిల్​ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. 

రిస్క్​ తీసుకోకుండా కొన్ని సాధించలేం

జీవితం, రాజకీయాల నుంచి లీడర్​షిప్ గురించి ఎంతో నేర్చుకున్నానని సీఎం రేవంత్​ చెప్పారు. నాయకత్వం విషయంలో కాంగ్రెస్​ పార్టీది అద్భుతమైన వారసత్వమని తెలిపారు. ‘‘మహాత్మా గాంధీ, పండిట్ జవహర్‌‌‌‌‌‌‌‌ లాల్​ నెహ్రూ, సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​, ఇందిరా గాంధీ, రాజీవ్​ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులే ఉదాహరణ. వారి జీవితం నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత గొప్ప నాయకుడికైనా ధైర్యం చాలా ముఖ్యం. తెలివితేటలు, నైపుణ్యం, కష్టపడి పనిచేయడంతో పాటు కొన్నిసార్లు అదృష్టం కూడా కలసిరావాలి.

గొప్ప పనులు చేయాలన్నా.. గొప్పది సాధించాలన్నా రిస్క్​ తీసుకోవాలి. రిస్క్​ తీసుకోకుండా కొన్ని సాధించలేం. గొప్పగొప్పవి సాధించాలంటే పెద్ద రిస్క్​ చేయాల్సిందే. మనం చేసే పోరాటంలో ఎన్నో కోల్పోవచ్చు. చాలా మంది గొప్ప నాయకులు.. ప్రజల కోసం తమ వృత్తిని, ఆస్తులు, సుఖాలు, స్వేచ్ఛతో పాటు ప్రాణాలనే త్యాగం చేశారు. మంచి నాయకుడిగా ఎదగాలనుకుంటే ముందు ధైర్యం, త్యాగం అనే రెండు మంచి విలువల గురించి ఆలోచించాలి. వాటిని పాటిస్తే విజయం  సొంతమవుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు.

ప్రజలతో నిత్యం అనుబంధాలను పెంపొందించుకోవాలని సూచించారు. రాష్ట్రం, దేశానికి సేవ చేయాలంటే ప్రజలతో అనుబంధాలు పెంపొందించుకోవడం చాలా ముఖ్యమన్నారు. పేదలు, ధనికులు, చిన్నా, పెద్దా అన్న భేదం లేకుండా సమాన గౌరవం ఇస్తూ స్నేహ భావంతో అందరిని కలుపుకుపోవాలని సూచించారు.  బిజినెస్​లోనూ ఇన్వెస్టర్లు, కస్టమర్లు, ప్రజలందరితోనూ కలుపుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో అనుబంధం ఉంటే ఏదైనా సాధించగలమని పేర్కొన్నారు. భవిష్యత్​ను మరింత తీర్చిదిద్దుకోవాలంటే లక్ష్యం కూడా చాలా ఇంపార్టెంట్​ అని సీఎం సూచించారు.