త్వరలో మరిన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు.. భూములిస్తేనే అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

  • పరిశ్రమలొస్తేనే ఉపాధి
  • త్వరలో సెగ్మెంట్ కు సిమెంట్ ఫ్యాక్టరీ
  •  కొడంగల్ భూముల ధరకు కోకాపేటంత పెరగాలె
  •  పట్టాభూములకు మాదిరిగా అసైన్డ్ ల్యాండ్స్ కూ పరిహారం
  •  సెగ్మెంట్ అద్దమోలె మెరువాలె.. ఆదర్శంగా నిలువాలె
  • ముఖ్య నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

కొడంగల్/హైదరాబాద్: అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరగాలంటే రైతులు భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో కొడంగల్ లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోకాపేటలో ఎకరం వంద కోట్లకు ఎందుకు పలికిందంటే అక్కడ అభివృద్ధి జరిగినందునే అన్నారు. కొడంగల్ లో భూముల ధరలు కూడా కోకాపేటంత పెరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, కొడంగల్ ను అద్దమోలె మెరిపిద్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ ను నిలుపుదామని అన్నారు. పట్టా భూములకు ఎంత పరిహారం ఇస్తామో.. అసైన్డ్ ల్యాండ్స్ కు కూడా అంతే ఇస్తామని, ఈ విషయాన్ని తాను అధికారులకు చెప్పినట్టు సీఎం తెలిపారు. కొడంగల్ లో అభివృద్ధి జరగకపోవడంతోనే ప్రజలు తాండూరు, రాయిచూర్, పరిగి, హైదరాబాద్, మహబూబ్ నగర్ కు పోతునారని, ఇక్కడ అభివృద్ధి చేసుకుంటే ఆ పట్టణాల వాళ్లే మన దగ్గరకు వస్తారని అన్నారు.

తనను కొడంగల్ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, తాను రాకున్నా 33 వేల ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించి అసెంబ్లీకి పంపారని, ముఖ్యమంత్రిని అయి వచ్చానని అన్నారు. మనకు వచ్చిన  అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిద్దామని చెప్పారు. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల ద్వారా లక్ష ఎకరాలకునీళ్లు ఇచ్చుకునే ప్రయత్నం జరుగుతుందన్నారు. కొడంగల్ ను  అద్దమోలె మెరిసేలా తీర్చిదిద్దుదామని అన్నారు.