మహిళా వర్సిటీ చాన్స్​లర్​గా సీఎం రేవంత్ రెడ్డి

  • ఆ వర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరుతో చట్ట సవరణ 
  • దీంతోపాటే యంగ్ ఇండియా స్పోర్ట్స్​యూనివర్సిటీ బిల్లు 
  • అసెంబ్లీలో 2  బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా మారుస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. వర్సిటీ చాన్స్​లర్​గా గవర్నర్ పేరుకు బదులు సీఎం పేరును చేర్చింది. ప్రస్తుతం విద్యాశాఖ పరిధిలో సీఎం చాన్స్​ లర్​గా ఉన్న వర్సిటీ ఇదొక్కటే కావడం విశేషం. ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం  ప్రవేశపెట్టారు. కాగా, కోఠి ఉమెన్స్ కాలేజీని 2022– -23 విద్యాసంవత్సరం నుంచి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ మహిళా  వర్సిటీగా ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరును అక్టోబర్ లో ప్రతిపాదించింది.  నగరంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ వర్సిటీ ఉంది. ఇందులో14 పీజీ, 28 యూజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని బిల్లులో సర్కారు పేర్కొన్నది. 

స్పోర్ట్స్​ వర్సిటీ బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్​బాబు

 యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అథ్లెట్లకు వరల్డ్ క్లాస్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో కోచింగ్ అందించేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఇందులో పేర్కొన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​తోపాటు క్లాస్ రూమ్, ఆఫీస్ ఏర్పాటుకు రూ.185 కోట్లు అవసరమవుతాయని సర్కార్ అంచనా వేసినట్టు బిల్లులో  వెల్లడించారు. మొదటి మూడేండ్లకు స్టాఫ్ జీతాలకు మరో రూ.45 కోట్లు అవసరమని తెలిపారు. ఒక్కో ఫస్ట్​ ఇయర్ విద్యార్థిపై రూ.5,74,420  ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. సెకండ్, థర్డ్ ఇయర్ కు చెందిన ఒక్కో విద్యార్థిపై రూ.3,29,230  ఖర్చు చేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా ఈ వ్యయాన్ని ఫీజు రూపంలో, ప్రైవేట్, స్టేట్ ఫండింగ్ ద్వారా కొంతమేర సమకూర్చుకోవాలని భావిస్తున్నట్టు బిల్లులో వెల్లడించారు.