తొలి పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం రేవంత్‌ రెడ్డి

త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ప్రకటించారు.  కొండగల్ లో పలు అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేసిన సీఎం..  అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..   మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు.  వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని  ప్రజలను  కోరారు.  

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 14  స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే దేశ స్థాయిలో తెలంగాణ గొప్పతనం  తెలుస్తుందన్నారు.  అసెంబ్లీ ఎన్నికలతోనే  కాంగ్రెస్ యుద్ధం అయిపోలేదని..  పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తేనే కాంగ్రెస్ యుద్ధం గెలిచినట్లు అవుతుందని చెప్పారు.  ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలన్నారు.  

వంశీ చంద్ రెడ్డి 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి  78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు.  2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో  బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యాడు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.