తెలంగాణ తల్లి విగ్రహం.. ఆత్మగౌరవానికి ప్రతీక.. అందరితో చర్చించాకే రూపకల్పన: అసెంబ్లీలో సీఎం రేవంత్​

  • ప్రజల మనోభావాలకు అద్దం పట్టింది: డిప్యూటీ సీఎం భట్టి
  • తెలంగాణ తల్లుల రూపం: పొంగులేటి
  • మట్టి బిడ్డల ప్రతిరూపం: సీతక్క
  • కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆఫీసుల్లో విగ్రహాలు పెట్టాలి: పొన్నం
  • కన్న తల్లిలా తెలంగాణ తల్లి విగ్రహం: కూనంనేని
  • చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేది: బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ తల్లి విగ్రహం.. మన ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందరితో చర్చించే విగ్రహానికి రూపకల్పన చేశామని తెలిపారు. ‘‘తెలంగాణ దేవత, తెలంగాణ తల్లి రెండు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. వజ్ర వైఢూర్యాలు, భుజకీర్తులు, కిరీటాలతో ఉండాలా? తల్లిలా ఉండాలా? అనే ప్రశ్న వచ్చినప్పుడు.. తల్లి ప్రతిరూపమే ఉండాలని మేధావులు, ఉద్యమకారులు, కళాకారులు, ఎమ్మెల్యేలు సూచించారు. 

తెలంగాణ తల్లిని చూస్తే మన తల్లిని చూసిన స్ఫురణ కలిగేలా విగ్రహాన్ని రూపొందించాం” అని చెప్పారు. సోమవారం అసెంబ్లీలో తెలంగాణ తల్లి విగ్రహంపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. గత పదేండ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆమోదించకపోవడం దురదృష్టకరమని అన్నారు. “తెలంగాణలోని 4 కోట్ల మందిమి ఏకమై పండుగ వాతావరణంలో తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహించుకోబోతున్నాం. దురదృష్టవశాత్తూ కొంతమందికి ఇది నచ్చట్లేదు. ఒక వ్యక్తి,  ఒక కుటుంబం, ఒక పార్టీ ఆలోచనే తెలంగాణ సమాజం అనుకోవడం తప్పు.. రాజుల పాలన ఇప్పుడు నడువదు. 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతున్నది. రాష్ట్రానికి గుండె కాయ లాంటి సెక్రటేరియెట్ లో ఇయ్యాల తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకుంటున్నం. ప్రతిఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు జరుపుకుందాం. ఈ నిర్ణయానికి సభ్యులంతా ఆమోదం తెలపాలి” అని కోరారు.


‘‘తెలంగాణ తల్లి కేవలం విగ్రహం కాదు.. మన ఆత్మగౌరవ ప్రతీక, మన జీవన గమ్యాన్ని నిర్దేశించే దీపిక. దేవత ఆశీర్వదిస్తుంది.. తల్లి ప్రేమను అందిస్తుంది. ఆ తల్లి అవతరణ ఉత్సవాలను గొప్పగా జరుపుకుందాం. విగ్రహం ఓపెనింగ్ కు అందరూ రావాలి. కవులు, కళాకారులు, ఉద్యమకారులు, మేధావులు ఎవరికైనా ఆహ్వానం అందకపోయినా రావాలని కోరుతున్నాను. రాజకీయాలకు అతీతంగా అన్నింటినీ పక్కనపెట్టి ఈ పోగ్రాంకు రావాలి. తర్వాత రాజకీయాలు, ఇతర అంశాలు మాట్లాడుకుందాం.. చర్చించుకుందాం” అని అన్నారు.  

ALSO READ : జననీ.. జయకేతనం.. సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సోనియాతోనే తెలంగాణ.. 

తెలంగాణ ప్రజల తరఫున సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణతో సోనియాగాంధీకి విడదీయలేని అనుబంధం ఉందని తెలిపారు. ఆమె తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నిజం చేసిన గొప్ప నాయకురాలు అని కొనియాడారు. వివిధ రూపాల్లో 60 ఏండ్ల పాటు తెలంగాణ ఉద్యమం జరిగిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతోమంది అమరులయ్యారని గుర్తు చేశారు. ‘‘తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని 2009 డిసెంబర్ 9న ప్రకటించారు. అందుకే డిసెంబర్ 9కి ఎంతో ప్రాధాన్యం ఉంది. గత ప్రభుత్వం పదేండ్ల పాటు అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రకటించలేదు. ప్రజల ఆకాంక్షలు గౌరవించలేదు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్ ను టీజీగా మార్చాం. ఉద్యమ కాలంలో స్ఫూర్తి నింపిన జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించాం” అని చెప్పారు.


సభ్యులు సభకు రాకపోతే ఎమ్మెల్యేలుగా ఫెయిల్‌‌ అయినట్లే: సీఎం

ఎమ్మెల్యేలు రోజు సభకు వస్తేనే ఆ పదవికి వారు న్యాయం చేసినట్లని, లేకపోతే ఫెయిల్‌‌ అయినట్లేనని సీఎం రేవంత్‌‌ రెడ్డి అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ముందు కమిటీ హాల్‌‌లో రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ శాసన సభా సమావేశం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సభ్యులకు పలు విషయాలపై దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజుల్లో నిత్యం సభకు వచ్చేలా సభ్యులు షెడ్యూల్ రూపొందించుకోవాలని సూచించారు. సభ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు సభకు రాకుండా ఇతర అంశాలకు ప్రాధాన్యత ఇస్తే వారు ఎమ్మెల్యేలుగా విఫలం అయినట్లుగానే భావించాల్సి వస్తోందని చెప్పారు. సభలో సభ్యులు ఎవరు కూడా నోరు జారవద్దని, హుందాగా మాట్లాడాలని, ప్రతిపక్ష సభ్యులు రెచ్చగొట్టేలా మాట్లాడినా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. ఈ ఏడాదిలో మన ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో ఇంటింటికి చేరేలా చూడాలన్నారు. బీఆర్‌‌‌‌ఎస్ పార్టీ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో విమర్శలు చేస్తుందని, ఆ పార్టీ విమర్శలకు చెక్ పెడుతూ.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా బీఆర్ఎస్ ఇలానే విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. తెలంగాణ దేవత వేరు, తెలంగాణ తల్లి వేరని.. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు.

తెలంగాణ తల్లుల రూపంలా విగ్రహం: పొంగులేటి

తెలంగాణ తల్లుల రూపం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉందని  మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. అన్ని కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులు, మండల ఆఫీసుల్లో విగ్రహాలను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం మంచిదని అన్నారు. ఏటా ఉత్సవాలు జరపాలన్న నిర్ణయాన్నీ స్వాగతిస్తున్నట్టు చెప్పారు. 

బీఆర్ఎస్​కు ఆ అర్హత లేదు: మంత్రి వెంకట్​రెడ్డి

రాజకీయ ఎదుగుదల కోసం తెలంగాణ పేరు తొలగించుకునే అవకాశ వాద పార్టీ కాంగ్రెస్​ కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజ కీయాల కోసం తెలంగాణ అనే పేరును తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకున్న వాళ్లకి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు.  ‘‘తెలంగాణ తల్లి నమూనా విడుదల చేయగానే.. తలపై కిరీటం లేదు.. మెడలో నెక్లెస్ లేదు.. ఒంటికి పట్టుచీర లేదు.. తెలంగాణ అస్థిత్వాన్ని ఆగం చేస్తున్నరని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. తెలంగాణ తల్లి  అచ్చ తెలంగాణ మహిళను పోలి ఉంటే అస్థిత్వం దెబ్బతిందా? కిరీటం లేదని అమ్మను అమ్మ కాదంటామా?  ఇదెక్కడి వాదన” అని ప్రశ్నించారు.

కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలి: మంత్రి పొన్నం

ప్రతి జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లు, పోలీస్, ప్రభుత్వం కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.  ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు సోనియా గాంధీ అకుంఠిత దీక్ష, కమిట్మెంట్ కారణమని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ  రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఇచ్చారని చెప్పారు.  

ఏపీలో పార్టీకి నష్టమని తెలిసినా తెలంగాణ ఇచ్చారు: మంత్రి జూపల్లి

తెలంగాణ ప్రజల ఆకాంక్ష, యువత ఆత్మబలిదానాలను గుర్తించిన సోనియా గాంధీ.. ఏపీలో కాంగ్రెస్​పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని  మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోనియా గాంధీని ప్రజలు ఎప్పటికీ మరచిపోరని తెలిపారు.   తెలంగాణ త‌‌ల్లి నూత‌‌న విగ్రహావిష్కరణను శాస‌‌న మండ‌‌లిలో స‌‌భ్యులు పార్టీల‌‌కతీతంగా స్వాగ‌‌తిస్తూ..  ప్రభుత్వాన్ని అభినందించార‌‌ని తెలిపారు. 

చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేది: పైడి రాకేశ్​రెడ్డి

తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ ఉంటే బాగుండేదని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్​ అభిప్రాయపడ్డారు. హస్తం ఉండడంతో కాంగ్రెస్​ తల్లిని పోలి ఉన్నదనే విమర్శలు వస్తున్నాయని చెప్పారు. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా విగ్రహాలు, పేర్లు మార్చుకుంటూ పోతే రాష్ట్ర  ప్రభుత్వానికి అది గుదిబండిగా మారుతుందని చెప్పారు.

కన్నతల్లిలా తెలంగాణ తల్లి విగ్రహం: కూనంనేని

 తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా రూపకల్పన చేస్తే తప్పు జరిగినట్లా?  అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహం  కన్నతల్లిలా ఉండాలనేదే ఉద్దేశమని  పేర్కొన్నారు.  తెలంగాణ హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు.  తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణలో బీఆర్ఎస్ ఉంటే బాగుండేదని అన్నారు.