త్వరలోనే లోకల్​బాడీ ఎన్నికలు కాంగ్రెస్​ విజయానికి కృషి చేయాలి.. క్యాడర్​కు సీఎం పిలుపు

  • ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచన
  • దీపాదాస్ మున్షిఅధ్యక్షతన గాంధీభవన్​లో కాంగ్రెస్ పీఏసీ సమావేశం
  • చీఫ్ గెస్ట్​గా హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్
  • సీఎంను ప్రతిపక్షాలు విమర్శిస్తే  కౌంటర్ ఇవ్వరా?.. మంత్రులకు కేసీ క్లాస్​

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో త్వరలోనే లోకల్​బాడీ ఎన్నికలు  జరుపుతామని, ఇందులో కాంగ్రెస్​ ఏకపక్ష విజయానికి నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని పార్టీ క్యాడర్​కు సీఎం రేవంత్ రెడ్డి  పిలుపునిచ్చారు.  ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను  ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.  బుధవారం సాయంత్రం గాంధీ భవన్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి దీపాదాస్ మున్షి అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ( పీఏసీ ) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీల్లో చాలా వరకు తొలి ఏడాదిలో అమలు చేశామని, ఈ విషయాన్ని పల్లెలు,  పట్టణాల్లో ప్రతి గడపకూ తీసుకెళ్లాలని కోరారు.

ప్రజా ప్రభుత్వంగా జనం తమను ఆదరిస్తుంటే ఓర్వలేని బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని, అందువల్ల వారి తప్పుడు ప్రచారాన్ని  ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలను వివరించాలన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి  అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి సంతాపం తెలిపామని, ఆయనకు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని సీఎం గుర్తుచేశారు.  మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందని, అందుకే ఆయనకు తెలంగాణతో ఉన్న అనుబంధానికి గుర్తుగా పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్ కు మన్మోహన్ సింగ్ పేరు పెట్టామన్నారు. 

26 నుంచి రైతు భరోసా

ఈ నెల 26  నుంచి రైతు భరోసా అందించబోతున్నామని, వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి  రూ.12వేలు ఇవ్వనున్నామని  సీఎం రేవంత్​ చెప్పారు. త్వరలోనే  కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు.  రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 55 వేల143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని వెల్లడించారు.

రాష్ట్రంలోని రైతాంగానికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఏడాదిలోనే రూ.54 వేల కోట్లను రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని చెప్పారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అమలు చేస్తున్నామని వివరించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, దీని ద్వారా  ఇప్పటి వరకు రూ. 4 వేల కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి చెల్లించామని చెప్పారు. 

అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే గ్యారంటీల అమలు: మహేశ్​ గౌడ్​

అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ గౌడ్  తెలిపారు.  ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ మీటింగ్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  రావడం పార్టీ నేతల్లో ఉత్సాహం నింపిందని అన్నారు. 6 గ్యారంటీల అమలుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. ప్రియాంక గాంధీపై  బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను పీసీసీ తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అంబేద్కర్​పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశామని చెప్పారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, రూ. 500 ల బోనస్ లాంటి అనేక పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచిందని వివరించారు. పీఏసీ సమావేశానికి చీఫ్​గెస్ట్​గా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరవగా, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ బలరాం నాయక్​, పార్టీ నేతలు జానారెడ్డి, జీవన్ రెడ్డి, గీతా రెడ్డి, చిన్నారెడ్డి, వంశీ చంద్ రెడ్డి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, షబ్బీర్ అలీ, మధు యాష్కీ గౌడ్​, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా, సమావేశానికి ముందు గాంధీ భవన్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి,  నివాళి అర్పించారు. పీఏసీ సమావేశానికి హాజరయ్యేందుకు గాంధీ భవన్ కు వచ్చిన కేసీ వేణుగోపాల్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్  స్వాగతం పలికారు. పీఏసీ సమావేశం దాదాపు 2 గంటల పాటు సాగింది. ఇందులో పలు విషయాలపై  చర్చించారు. సమావేశ వివరాలను మీడియా సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వివరించారు.

అందరి అభిప్రాయాలుతీసుకున్నరు: మంత్రి శ్రీధర్ బాబు 

పీఏసీ సమావేశం విజయవంతంగా ముగిసిందని, పార్టీ నేతల అందరి అభిప్రాయాలను కేసీ వేణుగోపాల్ తీసుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. పీఏసీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో చర్చించిన వివరాలను వెల్లడించారు. కేంద్రంలో  బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కఠినంగా వ్యవహరించాలని కేసీ వేణుగోపాల్ తమకు దిశా నిర్దేశం చేశారని చెప్పారు. కేబినెట్ విస్తరణపై పీఏసీ మీటింగ్ లో చర్చ జరగలేదన్నారు. సాధ్యమైనంత త్వరలోనే పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని పీఏసీలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

రెండు, మూడు వారాల్లో బూత్,  గ్రామ, మండలస్థాయి కమిటీలను పూర్తి చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ఓబీసీ కుల గణనను వేణుగోపాల్ ప్రశంసించారని, పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం ఉండాలని చెప్పారని అన్నారు. ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్లకు కార్పొరేషన్ పదవులు ఇవ్వడాన్ని  కేసీ స్వాగతించారని తెలిపారు.

దేవాదాయ శాఖలో కూడా కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఇటీవల కర్నాటకలోని బెల్గాంలో ఏఐసీసీ సమావేశమై తీసుకున్న  నిర్ణయాలను రాష్ట్రంలో పీసీసీ అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏడాదిపాటు మహాత్మా గాంధీ ఆలోచనలకు తగ్గట్టు కార్యాచరణ రూపొందించి, ప్రోగ్రాంలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పదేండ్లలో గత బీఆర్ఎస్ సర్కారు రైతుల కోసం కేవలం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది కాలంలో తాము రూ. 54 వేల కోట్లు ఖర్చు పెట్టామని కేసీకి వివరించామన్నారు.

కొందరి పనితీరుపై కేసీ అసంతృప్తి: షబ్బీర్ అలీ 

కొందరు మంత్రుల పనితీరు ఏమాత్రం బాగా లేదని కేసీ అసంతృప్తి వ్యక్తంచేసినట్టు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. అలాంటి వారు వెంటనే పద్ధతి మార్చుకోవాలని పీఏసీ  సమావేశంలో కేసీ సూచించారని అన్నారు. ప్రతినెలా మండలాలకు కూడా మంత్రులు వెళ్లి, పార్టీ కార్యకర్తల ఫిర్యాదులను పరిశీలించాలని సూచించినట్టు తెలిపారు. పీసీసీకి కొత్త కమిటీ వచ్చే వరకు పాత కమిటీ కొనసాగుతుందని, నెలకోసారి పీఏసీ మీటింగ్ పెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.

ఈ నెల 26,27 న రాష్ట్రంలో ‘సంవిధాన్ బచావో ర్యాలీ’ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించామని, ఇందులో పాల్గొనాలని కాంగ్రెస్ అగ్ర నేత  రాహుల్ గాంధీని ఆహ్వానిస్తూ పీఏసీ సమావేశం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఏడాది పాలనలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. 6 గ్యారంటీలను అమలు చేసినందుకు కేసీ అభినందించారని చెప్పారు.

మంత్రులకు కేసీ వేణుగోపాల్​ క్లాస్​

పీఏసీ సమావేశంలో రాష్ట్ర నేతలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ క్లాస్ ఇచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రాష్ట్రంలో ఐదేండ్ల కోసం కాకుండా దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేయాల్సిన అవసరముందని కేసీ సూచించారు. సీఎం రేవంత్ ను ప్రతిపక్షాలు విమర్శిస్తే ఆయనే కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని, మంత్రులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తాను స్పందిస్తున్నానని ఓ మంత్రి అనడంతో.. బదులుగా ఏ మంత్రి  స్పందిస్తున్నారో, ఎవరు కౌంటర్ ఇవ్వడం లేదో తమకంతా తెలుసని  చెప్పారు.  రాష్ట్రంలో ప్రభుత్వానికి, పార్టీకి మధ్య, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మధ్య మరింత సమన్వయం అవసరమని  స్పష్టంచేశారు.  ఏడాది కాలంగా పీఏసీ సమావేశం జరగలేదని, ఇకపై ప్రతి నెలా నిర్వహించాలని ఆదేశించారు.

రాబోయే రెండు వారాల్లో పీసీసీకి కొత్త కార్యవర్గాన్ని నియమించాలని, జాబితాను పంపిస్తే, తాను హైకమాండ్ నుంచి ఆమోదం పొందేలా చేస్తానని  హామీ ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల మధ్య విభేదాలున్నాయని,  వాటిని పరిష్కరించడంలో పీసీసీ నాయకత్వం చొరవ చూపాలని సూచించారు. పార్టీలో చేరిన కొత్త వారికి  సహకారం ఇవ్వకుంటే రాబోయే రోజుల్లో ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్​లోకి ఎలా వస్తారని నిలదీశారు.

కొందరు మంత్రుల పనితీరుపై కేసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘కొందరు మంత్రులు పార్టీ లైన్ దాటి  పని చేస్తున్నారు. అంతా తమ ఇష్టం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారు తమ పనితీరు మార్చుకోవాలి’ అని కేసీ హెచ్చరించినట్టు తెలిసింది. రాష్ట్రం పుట్టెడు అప్పుల్లో ఉన్నప్పటికీ, ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని, కానీ ఈ విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో  నేతలు విఫలమవుతున్నారని కేసీ అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, పార్టీ కోసం కష్టపడ్డ నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కేసీ సూచించారు.