బీజేపీని బొంద పెట్టాలి.. ఓట్ల కోసం దేవుళ్లను వాడుకుంటున్నరు: సీఎం రేవంత్

  • దేవుడు కూడా బీజేపీ నేతలను క్షమించడు
  • రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్నరు
  • రాజ్యాంగాన్ని కాపాడేందుకే రాహుల్​ యుద్ధం.. ఆయనకు తెలంగాణ సమాజం మద్దతివ్వాలి: సీఎం

హైదరాబాద్​, వెలుగు: దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు, రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీకి రాముడు, హనుమాన్‌ గుర్తుకొస్తారని.. తాత, ముత్తాతల కాలం నుంచే మనం శ్రీరామ నవమి, హనుమాన్‌ జయంతి చేసుకుంటున్నామని చెప్పారు. ‘‘ఓట్ల కోసం రాముడిని, హనుమంతుడిని వాడుకుంటున్న బీజేపీ నేతలను ఆ దేవుడు కూడా క్షమించడు. లోక్​సభ ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టాలి” అని ఆయన అన్నారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్​లో, హైదరాబాద్ సరూర్​నగర్​ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనజాతర సభల్లో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. ‘‘ఈ లోక్ సభ ఎన్నికలు మన జీవన్మరణ సమస్యగా మారాయి. అంబేద్కర్​ రాసిన రాజ్యాంగమే ప్రమాదంలో పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కిన రిజర్వేషన్లు, హక్కులు కూడా ప్రమాదంలో పడ్డాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేసేందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కంకణ బద్దులై బయలుదేరారు” అని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ నేతలు చెప్తుంటే, వాళ్లపై యుద్ధాన్ని ఇందిరమ్మ మనుమడు రాహుల్ గాంధీ ప్రకటించారని ఆయన తెలిపారు. ‘‘రాజ్యాంగాన్ని కాపాడేందుకు, రిజర్వేషన్లను రక్షించేందుకు బాహుబలిలా రాహుల్ గాంధీ ముందుకు వచ్చారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు, రిజర్వేషన్లను రక్షించేందుకు తెలంగాణ గడ్డ పైనుంచే ఆయన బీజేపీపై యుద్ధం ప్రకటించారు. ఈయుద్ధంలో తెలంగాణ సమాజం రాహుల్ గాంధీకి మద్దతుగా నిలవాలి” అని సీఎం కోరారు. 

ఆ బీజేపీ ఎంపీని అరెస్టు చేయాలి

‘‘ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్తూ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అమిత్ షా మాట్లాడుతున్నరు. మత విద్వేషాలు  రెచ్చగొట్టి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలని చూస్తున్నరు. రిజర్వేషన్లు రద్దు చేసి, దేశాన్ని దోచుకోవాలన్న బీజేపీ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉంది” అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని తెలిపారు. ‘‘కాంగ్రెస్ కృషి వల్లే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. మన్మోహన్​సింగ్​ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్​ నగరానికి  ఔటర్​ రింగ్​రోడ్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, మెట్రోరైల్​, ఇంటర్నేషనల్​ ఎయిర్​ పోర్ట్​ వచ్చాయి. కృష్ణా జలాలను, గోదావరి జలాలు ఈ ప్రాంతానికి తరలించి హైదరాబాద్​ నగరంలో శాంతి భద్రతలను కాపాడారు. అందుకే వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు , లక్షలాది ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగులకు వచ్చాయి” అని చెప్పారు. ‘‘బీజేపీ ఎంపీ ఒకరు హైదరాబాద్​కు వచ్చి 15 సెకన్ల టైమ్​ ఇస్తే చాలంటూ మత విద్వేషాలు రగిలించారు. పౌర సమాజం జాగృతంగా ఆలోచించాలి. ఇలా చేస్తే మనకు పెట్టుబడులు వస్తయా.. ఉద్యోగాలు వస్తయా..?” అని సీఎం ప్రశ్నించారు. విశ్వనగరంపై బీజేపీ విషం చిమ్ముతున్నదని మండిపడ్డారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీపై వెంటనే ఎన్నికల అధికారులు క్రిమినల్​ కేసులు పెట్టాలని.. అరెస్టు చేయాలని ఆయన డిమాండ్​  చేశారు. ‘‘అమిత్​షా, మోదీని ఒక్కటే అడుగుతున్నా ఆ  ఎంపీని సమర్థిస్తారా లేకపోతే బహిష్కరిస్తారా?” అని ప్రశ్నించారు. 

మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు

రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమీ లేదని అని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘బయ్యారంలో సోనియాగాంధీ ఉక్కుకర్మాగారం ఇస్తే..  బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. వరంగల్​లో సోనియాగాంధీ రైల్వే కోచ్​ ఫ్యాక్టరీ ఇస్తే.. బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చింది. సోనియాగాంధీ ఐటీఐఆర్​ కారిడార్​ ఇస్తే నరేంద్ర మోదీ గాడిద గుడ్డు ఇచ్చిండు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రిజర్వేషన్లు  కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. బీజేపీకీ ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి, రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లేనని అన్నారు.  ‘‘కేసీఆర్‌ బస్సుయాత్ర చూస్తుంటే ‘తిక్కలోడు తిరునాల పోతే.. ఎక్కడానికి దిగడానికి సరిపోయిందట’ అన్నట్టు ఉంది” అని సీఎం రేవంత్​రెడ్డి విమర్శించారు.