తెలంగాణపై పోలవరం ప్రాజెక్ట్ ప్రభావమెంత..? స్టడీ చేయాలని CM రేవంత్ ఆదేశం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరం ప్రాజెక్టు ప్రభావం తెలంగాణపై ఏ మేర పడనుందనే దానిపై అధ్యయనం చేయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనం చేయించాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. నెల రోజుల్లోగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయం కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపైన స్టడీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో శనివారం (జనవరి 4) కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. ఈ సమీక్షలో ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక విషయాలను అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 2022లో వచ్చిన 27 లక్షల క్యూసెక్కుల వరదతో భద్రాచలం ముంపునకు గురైందని  సీఎంకు వివరించారు. అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా బనకచర్ల ప్రాజెక్టు చేపడుతోందని.. దీనికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.

ALSO READ | అతి విశ్వాసమే గత ఎన్నికల్లో BRS ఓటమికి కారణం: కేటీఆర్

దీంతో బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణంపై అభ్యంతరం తెలుపుతూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయాలని అధికారులకు సీఎం రేవంత్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కేంద్ర జలశక్తి శాఖలకు లేఖలు రాయాలని అధికారులకు ఆదేశించారు.