పారా అధ్లెట్ దీప్తి జివాంజీకి సీఎం రేవంత్ అభినందనలు

హైదరాబాద్: తెలంగాణ అమ్మాయి, పారిస్ పారాలింపిక్స్ పతక విజేత దీప్తి జివాంజి అర్జున అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీప్తి జివాంజికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శభాకాంక్షలు తెలిపారు. పారాలింపిక్స్‌లో భారత్ తరఫున కాంస్య పతకం సాధించిన తెలంగాణ యువ అథ్లెట్, వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి విశిష్ట క్రీడా పురస్కారం అర్జున అవార్డు 2024కు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ, జాతీయ క్రీడల్లో సత్తా చాటే యువ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ప్రజా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దీప్తికి రూ.1 కోటి నగదు బహుమతితో పాటు గ్రూప్-2 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం, వరం‌గల్‌లో 500 గజాల స్థలం కేటాయించిన విషయం తెలిసిందే. 

తెలంగాణ యువ క్రీడాకారులు మరింతగా రాణించాలని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మితం కానున్న స్పోర్ట్స్ కాంప్లెక్సులు అందుకు దోహదపడతాయని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుకు ఎంపికైన గుకేష్ (చెస్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (ప్యారా అథ్లెటిక్స్), మను బాకర్ (షూటింగ్)లకు సైతం సీఎం రేవంత్ కంగ్రాట్స్ చెప్పారు. వీరితో పాటు 2024కు సంబంధించి వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అర్జున, ద్రోణాచార్య అవార్డులకు ఎంపికైన క్రీడాకారులు, కోచ్‌లకు కూడా రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.