దేశం ఒక గొప్ప లీడర్‎ను కోల్పోయింది.. మన్మోహన్ మృతికి సీఎం రేవంత్ సంతాపం

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని బాధపడ్డారు. ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఒక ఆర్థిక వేత్తగా, ఒక అధ్యాపడిగా, రిజర్వు బ్యాంకు గవర్నర్‎గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. 

యూపీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించి పదేళ్లపాటు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశంలో అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పూడ్చలేనిదని అన్నారు. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. 

కాగా, గురువారం (డిసెంబర్ 26)  భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూసిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్‎లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి ఆయన తుది శ్వాస విడిచారు. దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ ఆర్థిక వేత్త, డైనమిక్ లీడర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల పలువురు దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.