జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు: సీఎం రేవంత్

ప్రఖ్యాత తబలా విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ హుస్సేన్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తండ్రి అల్లారఖా బాటలోనే నడుస్తూ తబలా వాయిద్యం పట్ల, హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో జాకీర్ హుస్సేన్ తనదైన ముద్ర వేసుకుంటూ అంతర్జాతీయ ఖ్యాతి గడించారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. జాకీర్ హుస్సేన్ మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. జాకీర్ హుస్సేన్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ (73) సోమవారం తెల్లవారుజూన కన్నుమూసిన విషయం తెలిసిందే. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. జాకీర్ హుస్సేన్ 1951, మార్చి 9న అప్పటి బాంబే సిటీలో జన్మించారు. ఆయన లెజెండరీ తబలా ప్లేయర్ అల్లా రఖా పెద్ద కొడుకు. జాకీర్ కూడా చిన్నప్పటి నుంచే సంగీతంలో పట్టు సాధించి తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు.

ALSO READ | జాకీర్ హుస్సేన్ ఇకలేరు

సెయింట్ మైకేల్స్ హైస్కూల్‎లో పాఠశాల విద్య, సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్, ఫ్యూజన్‎లో నైపుణ్యం సాధించారు. ఎంతో ఎనర్జిటిక్‎​గా, వినసొంపుగా, హావభావాలు పలికిస్తూ తబలా వాయించే జాకీర్ హుస్సేన్ భారత్‎తో పాటు ప్రపంచవ్యాప్తంగానూ మేటి తబలా ప్లేయర్‎గా, తబలా మేస్ట్రోగా పేరు గడించారు. తబలా వాయించడంలో ఎన్నో విచిత్రమైన బాణీలను ప్రవేశపెట్టి తనకు తానే సాటి అని చాటుకున్నారు. ఆయన కథక్ డ్యాన్సర్, టీచర్ ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  

13 ఏండ్లకే మొదటి ప్రదర్శన.. 

జాకీర్ హుస్సేన్ 13 ఏండ్లకే తన తొలి ప్రదర్శన ఇచ్చారు. అయితే, దీని వెనక ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. నిజానికి ఓ ప్రదర్శనలో తబలా వాయించేందుకు రావాలంటూ అల్లా రఖాకు ఇన్విటేషన్ వచ్చింది. కానీ ఆ లెటర్ జాకీర్ చేతికి అందింది. దీంతో ఆ లెటర్‎కు అల్లా రఖా మాదిరిగా తానే బదులిచ్చారు. ఆ కార్యక్రమానికి తాను రాలేనని, తన కొడుకు జాకీర్ హుస్సేన్ అందుబాటులో ఉన్నారని ప్రత్యుత్తరం పంపారు. అయితే, అతడి వయస్సు అప్పుడు 13 ఏండ్లు అన్న విషయం చెప్పకుండా దాచారు. దాంతో జాకీర్‎కు అలా ఫస్ట్ బుకింగ్ కన్ఫమ్ కావడం..ఆయన వెళ్లి తబలా వాయించి భళా అనిపించుకోవడం చకచకా జరిగిపోయాయి. 

అప్పటి నుంచి ఆయన దాదాపు ఆరు దశాబ్దాలుగా అసమాన ప్రతిభతో ప్రపంచంలోనే మేటి తబలా ప్లేయర్‎గా మన్ననలు అందుకున్నారు. సంగీత రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన గ్రామీ వేదికపై ఐదు అవార్డులను అందుకున్నారు. 1973లో ఇంగ్లిష్ గిటారిస్ట్ జాన్ మెక్ లాలిన్, వయోలినిస్ట్ ఎల్. శంకర్, పెర్క్యూషనిస్ట్ టీహెచ్ విక్కూ వినాయక్ రామ్ వంటి ఉద్ధండులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చి మెప్పించారు. భారత ప్రభుత్వం ఆయనను 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది.