అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టారు.. ఆయనకేమైనా కాళ్లు, చేతులు పోయాయా : సీఎం రేవంత్ రెడ్డి

తెలుగు సినిమా ఇండస్ట్రీని.. అసెంబ్లీ సాక్షిగా కడిగిపారేశారు సీఎం రేవంత్ రెడ్డి. సంధ్య ధియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ తల్లి చనిపోతే.. ఓ పిల్లోడు చావుబతుకుల మధ్య ఉంటే.. ఒక్కరు అంటే ఒక్క రు కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి పరామర్శించలేదని.. ఇంత దుర్మార్గంగా ఉంటారా అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.. తొక్కిసలాటకు కారణం అయిన అల్లు అర్జున్ ను ఒక్క రోజు అరెస్ట్ చేస్తేనే.. ఆయన ఇంటికి మొత్తం సినిమా ఇండస్ట్రీ క్యూ కట్టిందని.. సినిమా వాళ్లు అంతా ఆయనకు ఇంటికి వెళ్లి పరామర్శించారని.. ప్రభుత్వాన్ని.. నన్ను తిడుతున్నారంటూ.. సినీ ఇండస్ట్రీ వైఖరిని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి.

బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ వస్తున్నట్లు డిసెంబర్ 2న అప్లికేషన్ పెట్టుకున్నారని,3న పోలీసులు తిరస్కరించారని సీఎం తెలిపారు. పోలీసులు తిరస్కరించిన తర్వాత కూడా 4 తేదీన సాయంత్రం అల్లు థీయేటర్ కు వచ్చారని అన్నారు. ఎక్స్ రోడ్ దాటక ముందే.. రూఫ్ టాప్ లో ఉండి చేతులు ఊపి రోడ్ షో చేశారని, అక్కడ ఉన్న అన్ని థీయేటర్ లలో ఉన్న అభిమానులు బయటకు వచ్చారని, దీంతో క్రౌడ్ ను కంట్రోల్ చేయడం కష్టం అయిపోందని సీఎం తెలిపారు. ఈ పరిస్థితుల్లో అతని ప్రైవేటు సెక్యూరిటీ.. 50, 60 మంది బౌన్సర్లు  విపరీతంగా ఎలా పడితే అలా తోసేయడంతో తొక్కిసటాల జరిగిందని సీఎం తెలిపారు. చవరికి అక్కడ ఉన్న జనాలను జరపగా అక్కడ ఇద్దరు విగత జీవులుగా పడిఉన్నారని తెలిపారు. 

ఆ సిచ్యువేషన్ లో పోలీసులు వచ్చి హీరోను వెళ్లిపొమ్మని చెప్పినా కూడా వెళ్లలేదని, సినిమా చూసే వెళ్తానని అక్కడే ఉండిపోయారని తెలిపారు. హీరో థియేటర్ లో ఉండగా.. బాల్కనీలో కూడా అభిమానులు నిల్చొని ఒకరిపై ఒకరు పడే పరిస్థితి ఉన్నదని అన్నారు. కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఏసీపీ వచ్చి హీరో వెళ్లాలని చెప్పడానికి వెళ్తే.. ఏసీపి కూడా రావొద్దని థియేటర్ వాళ్లు చెప్పారని, ఇలాగైతే అందరిపై కేసులు పెడతామని చెప్పడంతో ఏసీపీని లోనికి అనుమతించారని అన్నారు. 
పరిస్థితి అదుపు తప్పిందని, హీరోకు వెళ్లమని చెబితే.. లేదు సినిమా చూసి వెళ్తానని మొరాయించడంతో చివరికి డీజీపీ వచ్చి మీర వెళ్లకుంటే స్టేషన్ కు తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పడంతో హీరో బయటకు వచ్చారని అన్నారు. బయటకు వచ్చిన హీరో మళ్లీ చేతులు ఊపుకుంటూ.. రోడ్ షో చేయడంతో తొక్కిసలాట జరిగిందని అన్నారు.

ఆ తర్వాత పోలీసులు కేసు చెయ్యడం.. దీని గురించి మాట్లాడితే బాధ్యతారాహిత్యంగా మాట్లాడినట్లు తెలిసిందని.. ఆ పరిస్థితుల్లో అల్లు అర్జున్ ను స్టేషన్ కు తీసుకెళ్లారని సీఎం తెలిపారు.