వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. సిద్ధం సభలకు..జగన్ రోడ్ షోకు జనాలు భారీగా తరలివస్తున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ అంతటా మొదటి విడత ప్రచారం చివరి దశలో ఉంది. ఈ రోజు ( ఏప్రిల్ 13) ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడలో జగన్ సిద్దం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు వచ్చిన అభిమానులు జగన్‌పై పూల వర్షం కురిపించారు. అయితే ఈ సమయంలో ఓ ఆగంతకుడు జగన్ పై రాయి విసిరిన ఘటన చోటు చేసుకుంది. దీంతో జగన్ ఎడమ కంటికి గాయమైంది. జగన్ యాత్ర చేస్తున్న బస్సులోనే వైద్యులు చికిత్స అందించారు.
జగన్‌కు వచ్చే జనాన్ని చూసి ఓర్చుకోలేక కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దాడి జరిగిన రూట్లో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆగంతకుడు పూలతో బలంగా రాయిని విసిరాడు. దగ్గరలోని పాఠవాల భవనం పక్క నుంచి ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడని సమాచారం అందుతోంది. విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో దాడి జరిగింది. అయితే సీఎం జగన్ దాడిని లెక్క చేయకుండా ప్రథమ చికిత్స అనంతరం యాత్రను కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ ఘటనలో సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా గాయాలయ్యాయి.జగన్ కు వస్తున్న ప్రజాభిమానాన్ని తట్టుకోలేకనే టీడీపీ వర్గాలు దాడి చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.