దిశ యాక్ట్ పై సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో దిశ దారుణం తరువాత ఏపీ సీఎం జగన్ మహిళల రక్షణ కోసం పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నారు.
గురువారం సీఎం జగన్.,హోం మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం,అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, డీజీపీ సవాంగ్ తో సమీక్ష నిర్వహించారు.
సమీక్ష సందర్భంగా దిశయాక్ట్ అమలు చేసేందుకు అన్నీ చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారుల్ని ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 13కోర్ట్ లకు వెంటనే బడ్జెట్ కేటాయించాలని సీఎం ఆదేశించారు. 13మంది ప్రాసిక్యూటర్లు, విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ లో 175 ఖాళీలు ఉన్నాయని సవాంగ్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 18మహిళా పోలీస్ స్టేషన్లలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్సైలు, నలుగురు సహాయక సిబ్బందిని కేటాయించాలని డీఎస్పీ కోరారు. అందుకు జగన్ అంగీకరించారు. ఖాళీగా ఉన్న ఫోరెన్సిక్ పోస్ట్ లకు జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు సీఎ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
సురక్ష స్పందన యాప్ :
దిశాయాక్ట్ చేశాం. కానీ ఎక్కడా చట్టం అమలు కావడం లేదని వినపడకూడదని జగన్ అధికారులకు సూచించారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చాలా మంది పనిచేస్తున్నారని, చంద్రబాబు తన పార్టీతో పాటు ఆయన అనుకూల మీడియాతో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేలా దిశయాక్ట్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో మహిళ రక్షణ కోసం సురక్ష స్పందన యాప్ ద్వారా 86రకాలైన సేవలు అందిస్తున్నట్లు డీజీపీ, సీఎం కు తెలిపారు. అయితే దిశ యాక్ట్ యాప్ ను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఇందుకు కావాల్సిన నిధుల్ని కేటాయిస్తామన్న సీఎం..మహిళాపోలీస్ స్టేషన్ల, దిశా చట్టం అమలు అయ్యేందుకు ప్రత్యేకంగా ఒక మహిళా ఐపీఎస్ అధికారిని నియమించేలా ఆలోచన చేయాలని డీజీపీకి సీఎం జగన్ సూచించారు.
