కుప్పంకు మేలు చేయని చంద్రబాబు.. రాష్ట్రానికి ఏం చేస్తాడు : సీఎం జగన్‌

టీడీపీ అధినేత  చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సీఎం జగన్​ సోమవారం ( ఫిబ్రవరి 26) పర్యటించారు.  కుప్పం ప్రజలకు కృష్ణా జలాలను అందించిన సీఎం... పాలారు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.. కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేసి, కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌(Kuppam Branch Canal))ను జాతికి అంకితం చేశారు. కుప్పం ప్రజలకు తాగు, సాగునీటి కష్టాలు లేకుండా చేస్తామన్న మాటను నిలబెట్టుకున్నామని సీఎం అన్నారు. . కుప్పం, పలమనేరులోని 4.02 లక్షల జనాభాకు తాగునీరు అందనున్నట్లు తెలిపారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandra babu) సొంత నియోజవర్గమైన కుప్పం మేలు గురించి పట్టించుకోని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(AP CM Jagan) దుయ్యబట్టారు. సోమవారం కుప్పం (Kuppam) నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. 35 సంవత్సరాలుగా కుప్పం ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేకపోయారని, అటువంటి వ్యక్తి మరోసారి ఎమ్మెల్యేగా పోటీకి అర్హుడు కాదని పేర్కొన్నారు

మూడు దశాబ్దాలుగా కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు పూర్తిచేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. కులం, మతం, ప్రాంతం, పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని అందించామని వివరించారు. కుప్పం ప్రజలంతా మావాళ్లేనని గర్వంగా చెబుతున్నా అని ప్రకటించారు. కోపం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నన్ను, సీమను తిడుతూ ఉంటాడని చెప్పారు. అవసరానికి వాడుకుని వదిలేసి చంద్రబాబు ఎందుకు అని కుప్పం ప్రజలను సీఎం జగన్‌ ప్రశ్నించారు. చంద్రబాబును నిలదీయాల్సిన సమయం వచ్చిందని గుర్తుచేశారు. 

చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే ఒక్క పథకమైనా ఉందా? అని సీఎం జగన్‌ ప్రశ్నించారు. ఏ ఒక్క ఇంటికైనా మంచి చేశారా? అని అడిగారు. మంచి చేసి ఉంటే బాబుకు పొత్తులెందుకు అన్నారు. కాపులకు చంద్రబాబు చేసిన మంచి ఏమిటో చెప్పాలని సవాల్‌ విసిరారు. ఈసారి చంద్రబాబును ఓడించండి అని పిలుపునిచ్చారు.ఈ నియోజకవర్గానికి నీరు అందించే కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 2022 సెప్టెంబర్ 23న జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన మాట నెలుబెట్టుకొని ఈరోజు కుప్పంకు నీరు అందించామన్నారు. కుప్పంలో నీరు నిలుపుదల చేసేందుకు మరో రెండు రిజర్వాయిర్లు నిర్మిస్తాంమని హామీ ఇచ్చారు. గుడిపల్లి మండలం యామగానిపల్లి, శాంతిపురం మండలం మాధనపలి వద్ద మరో రిజర్వాయర్ చేపడుతున్నట్లు తెలిపారు. 530 కోట్లతో రిజర్వాయిర్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. 

కుప్పంకు చంద్రబాబు ప్రయోజనం లేదంటూ.. బ్రాంచ్ కెనాల్ పనులు కూడా చంద్రబాబు పూర్తి చేయలేదని వివరించారు. ప్రజా ధనాన్ని ఎలా దోచుకోవాలి, ఎలా ముడుపులు తీసుకోవాలనే విషయాల మీద మాత్రమే చంద్రబాబు రీసెర్చ్ చేశారన్నారు. చంద్రబాబుకు కావాల్సిన వాళ్లకు మాత్రమే కాంట్రాక్ట్‎లు ఇచ్చి డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు.కుప్పం నియోజకవర్గం ప్రజల దాహార్తిని కూడా చంద్రబాబు తీర్చలేదని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు వల్ల కుప్పం ప్రజలకు మేలు జరిగిందా అని ప్రశ్నించారు. అదే క్రమంలో వైసీపీ ప్రభుత్వం వల్ల కుప్పం ప్రజలకు మేలు జరిగిందా అని అడిగారు. కుప్పంకు కృష్ణ జలాలను తీసుకొచ్చింది మీ జగన్ అని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు మెడికల్ కాలేజీ రాకుండా చేసింది చంద్రబాబు అంటూ విమర్శించారు. కుప్పంను మునిసిపాలిటీ చేసింది మీ జగన్ అని తన పాలన గురించి వివరించారు. చంద్రబాబు హయాంలో కనీసం ఒక రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్‎లోకి వచ్చిందా? అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ 3 వేలు పెన్షన్ ఇవ్వడం లేదు.. కానీ కేవలం ఈ నియోజకవర్గంలోనే 43 వేల మందికి పెన్షన్ అందిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో సుమారు 15 వేల ఇళ్ల పట్టాలను ఇచ్చాం.. ఈ నెలలో మరో 15 వేల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నామన్నారు. అలాగే 77 గ్రామాల్లో విలేజ్ క్లినిక్‎లు నిర్మించి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. కుప్పం నియజకవర్గంలో 87,941 కుటుంబాలు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో 82,039 కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందాయన్నారు. కేవలం మహిళలకే 1400 కోట్లు అందించాం అని తెలిపారు. భరత్‎ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తానని సభ సాక్షిగా హామీ ఇచ్చారు.