రాజకీయ వర్గాలతో సహా సామాన్యులు కూడా ఎంతగానో ఎదురు చూసిన కూటమి ఉమ్మడి మేనిఫెస్టో రానే వచ్చింది. మేనిఫెస్టో ఆద్యంతం జనరంజక పథకాలతో నింపేసాడు చంద్రబాబు. ఈ క్రమంలో కూటమి మేనిఫెస్టోపై స్పందించిన సీఎం జగన్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కూటమి మేనిఫెస్టోలో ప్రధాని మోడీ ఫోటో లేకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబుకు బీజేపీ అధిష్టానం ఫోన్ చేసిందని, మేనిఫెస్టోపై మీ ఫోటోలే పెట్టుకోండని, మోడీ ఫోటో పెడితే ఒప్పుకోబోమని అందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేనిఫెస్టో మీద మోడీ ఫోటో వద్దన్నారంటే చంద్రబాబు హామీలన్నీ మోసపూరితమైనవే అని బీజేపీకి కూడా అర్తమయ్యిందని తెలిసిపోతుందని అన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలే కాదు, పొత్తు పెట్టుకున్న బీజేపీ కూడా నమ్మే పరిస్థితిలో లేదని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉండగా మేనిఫెస్టో విడుదల సందర్బంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ, జనసేన పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశం అయ్యాయి. మేనిఫెస్టో అమలు చేసే బాధ్యత టీడీపీ, జనసేనదే అని, బీజేపీ మద్దతు ఉంటుందని అన్నారు. మేనిఫెస్టోపై మోడీ ఫోటో లేకపోవటంతో పాటు, చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కొత్త చిచ్చుకు దారి తీశాయి.