జగన్ భూములు ఇచ్చేవాడే తప్ప, లాక్కునే వ్యక్తి కాదు.. సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు  సమయం ముంచుకొస్తున్న తరుణంలో రాజకీయ వేడి పతాక స్థాయికి చేరింది. అధికార ప్రతిపక్షాల మేనిఫెస్టోలు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. నేతలంతా ప్రచారంలో మునిగిపోవటంతో విమర్శ, ప్రతివిమర్శలతో రాష్ట్రం హోరెత్తుతోంది. ఈ క్రమంలో పాయకరావు పేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

తాను భూములు లాక్కుంటానని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని, జగన్ భూములు ఇచ్చేవాడే తప్ప, లాక్కునే వ్యక్తి కాదని అన్నారు. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పని కూడా గుర్తు రాదని, 2014 ఎన్నికల్లో ఇచ్చిన వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేయటానికి సిద్ధమయ్యాడని మండిపడ్డారు జగన్. చంద్రబాబు ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తానని అంటే నమ్ముతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మొద్దని అన్నారు జగన్.