రేపే జగన్ మంత్రివర్గం ప్రమాణం : 25 మందితో జంబో కేబినెట్

రేపే జగన్ మంత్రివర్గం ప్రమాణం : 25 మందితో జంబో కేబినెట్

*ఏపీ మంత్రి వ‌ర్గ ఏర్పాటులో సీఎం జ‌గ‌న్ వ్యూహం

*సామాజిక వ‌ర్గ స‌మీక‌ర‌ణ‌ల‌కు అధిక ప్రాధాన్యం

*ఐదుగురు ఉప‌ముఖ్య‌మంత్రులు

*50 శాతం మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాలే

*90 శాతం మంది మంత్రుల ప‌ద‌వీకాలం రెండున్న‌రేళ్లు

*రెండున్న‌రేళ్ల‌కు తిరిగి పున‌ర్ వ్య‌వ‌స్తీక‌ర‌ణ‌

*మ‌హిళ‌ల‌కు కీల‌క శాఖ‌లు ఇచ్చే అవ‌కాశం

*స్పీక‌ర్ గా త‌మ్మినేని సీతారాం..

*ఎస్సీ, ఎస్టీ. బీసీ, మైనారిటీ, కాపు వ‌ర్గాల‌కు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌వులు

*మంత్రివ‌ర్గ ఏర్ప‌టులో కొత్త పంథా అనుస‌రిస్తున్న జ‌గ‌న్

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రూపకల్పనలో తన మార్క్ చూపించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి… శనివారం మొదటిసారిగా సెక్రటేరియట్‌లో అడుగుపెట్టబోతున్నారు. శనివారం ఉదయం 8:39 గంటలకు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వెళ్తారు సీఎం జగన్. సచివాలయంలోకి సీఎం జగన్ వచ్చిన వెంటనే బ్లాక్ 1 ముందు శృంగేరి పీఠ వేద పండితులు స్వాగతం పలుకుతారు.

సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్‌లో సీఎం ఆఫీస్ ఉంది. ఇప్పటికే సీఎం రాకకోసం అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తన ఆఫీస్‌లో హంగూ ఆర్భాటాలేవీ ఉండొద్దని ముందే చెప్పిన జగన్… అత్యంత సాదాసీదాగా ఉండేలా చెయ్యాలని ఆదేశించారు.

మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 11:49కి ఉంటుంది. సచివాలయం దగ్గర్లోనే ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 2 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి కేబినెట్ భేటీ ఉంటుంది.

ఏపీలో గ‌త‌నెల 30న వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేసిన‌రోజు నుంచి మంత్రివ‌ర్గ కూర్పుపై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగుతూ వచ్చాయి. చాలామంది శాస‌న‌స‌భ్యుల పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అంద‌రి అంచ‌నాల‌ను సీఎం వై ఎస్ జ‌గ‌న్ ప‌టాపంచ‌లు చేశారు. త‌న మంత్రివ‌ర్గం ఎలా ఉంటుందో స్ప‌ష్ట‌త‌ను ఇచ్చారు. తాడేప‌ల్లి లోని సీఎం నివాసం వ‌ద్ద జ‌రిగిన వైసీపీ ఎల్పీ స‌మావేశంలో జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న రాజ‌కీయ‌వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. 25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించనున్నట్లు సీఎం వివరించారు. కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్ స్పష్టం చేశారు.

మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్‌లో అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు.

క్యాంప్ ఆఫీస్ సమావేశంలో మాట్లాడిన జగన్.. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలన్నారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలన్నారు. హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కలిసి జ్యుడీషియల్‌ కమిషన్‌ గురించి అడిగాననీ… ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలని చెప్పారు.  ప్రతి కాంట్రాక్ట్‌ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుందనీ… ఏడు రోజుల పాటు పబ్లిక్‌ డొమైన్‌లో టెండర్ల ప్రక్రియ ఉంటుందని… జ్యుడీషియల్‌ కమిషన్‌ సూచనల మేరకు ప్రతి టెండర్‌లో మార్పులు ఉంటాయని చెప్పారు.