హైదరాబాద్, వెలుగు: గ్రామీణ క్రీడా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలకు రంగం సిద్ధమైంది. మొత్తంగా 36 క్రీడలతో నాలుగు దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సీఎం కప్ శనివారం ప్రారంభం అవనుంది. తొలి దశలో శని, ఆదివారాల్లో గ్రామ స్థాయిలో పోటీలు నిర్వహిస్తారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 12,670 గ్రామాల్లో అథ్లెటిక్స్, ఫుట్ బాల్, వాలీబాల్, కబడ్డీ, ఖో -ఖో, యోగా తో పాటు స్థానికంగా డిమాండ్ ఉండే మరో ఆటలో పోటీలు జరుగుతాయని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (శాట్జ్) తెలిపింది. ఈ నెల 10–12 తేదీల్లో మండల స్థాయి, 16–21 వరకు జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని తెలిపింది. అనంతరం 27 నుంచి జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలను హైదరాబాద్‌లో నిర్వహిస్తామని పేర్కొంది. ఏకకాలంలో ఇన్ని వేల గ్రామాల్లో పోటీలు నిర్వహించిన దాఖలు లేవని శాట్జ్ చైర్మన్ శివసేన రెడ్డి అన్నారు. నేటి నుంచి నెల రోజులపాటు రాష్ట్రంలో క్రీడల పండుగ వాతావరణం నెలకొంటుందని చెప్పారు.