మరింత వరద వచ్చే అవకాశం.. సిద్ధంగా ఉండాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..

విజయవాడ వరదలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై  మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. వరద బాధితుల కష్టాలపై అవిశ్రాంతంగా పని చేస్తున్నామని, నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని అన్నారు.

బాధిత ప్రజలకు త్వరితగతిన రిలీఫ్ ఇచ్చేందుకు పండుగ రోజు కూడా పని చేయాలని అధికారులను కోరారు. బుడమేరుకు పడిన మూడో గండి పూడ్చే పనులు కొలిక్కి వచ్చాయని... మరి కొద్దిసేపట్లో ఆ పనులు పూర్తవుతాయని అన్నారు చంద్రబాబు. దీంతో విజయవాడలోకి నీళ్లు రావని, భవిష్యత్తులో కూడా వరదలు వచ్చినా నీళ్లు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని అన్నారు

రేపు సాయంత్రానికి పూర్తిగా వీధుల్లో వరద నీరు తగ్గిపోతుందన్నారు. రేపు ( సెప్టెంబర్ 8, 2024 ) సాయంత్రానికి వరద నీరు తగ్గిపోతుందని, తెలంగాణలో వర్షాలకు ఏపీకి కూడా కొంత వరద వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు.