రాసి పెట్టుకోండి.. ఢిల్లీలో కూడా బీజేపీదే విజయం: సీఎం చంద్రబాబు

విశాఖ: గతేడాది జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.. రాసి పెట్టుకోండి.. వచ్చే నెలలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీదే విజయమని ఏపీ సీఎం చంద్రబాబు జోస్యం చెప్పారు. దేశ ప్రజలంతా మోడీ వెంటే ఉన్నారు.. ఇకపైన మోడీతోనే ఉంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం, పేద ప్రజల కోసం ప్రధాని మోడీ ప్రతిక్షణం పని చేస్తున్నారని కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ ప్రజలకు దగ్గరైన వ్యక్తి మోడీ అని.. ప్రపంచ మెచ్చే నాయకుడు మోడీ అని ప్రధానిని ఆకానికెత్తారు. వివిధ అభివృద్ధి పనుల శంఖు స్థాపనలు, ప్రారంభోత్సవాల కోసం ప్రధాని మోడీ బుధవారం (జనవరి 8) ఏపీ విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ  ఏయూలో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేశారు. 

ALSO READ | ఏపీ చేరుకున్న ప్రధాని మోడీ.. విశాఖలో భారీ రోడ్ షో

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..  బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ అదిరిందని.. చరిత్రలో నిలిచిపోయేలా 93 శాతం స్ట్రైక్ రేట్, 57 శాతం ఓట్లతో ఎన్డీఏను ప్రజలు గెలిపించారని గుర్తు చేశారు. ఏపీలో ఈ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుందని.. మోడీనే ప్రధానిగా ఉంటారని అన్నారు. ప్రధాని మోడీ నుండి తాను స్ఫూర్తి పొందుతుంటానని తెలిపారు సీబీఎన్. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి కావడంలో ప్రధాని మోడీ సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. మీరు శంఖుస్థాపన చేసి.. కలలు కన్న అమరావతిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 

ప్రధాని మోడీ సారథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు నదుల అనుసంధానం పూర్తి చేస్తామని పేర్కొన్నారు. రామాయపట్నంలో బీపీసీఎల్ వచ్చిందంటే దానికి కారణం ప్రధాని మోడీనే అని చెప్పారు. రేపటి గురించి ఇవాళే ఆలోచించే ప్రధాని ఉండటం మన అదృష్టమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం వల్ల ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని.. కష్టాలు, సమస్యలు ఉన్నాయి.. వాటిని అధగమించి ముందుకు వెళ్తామన్నారు. 

ALSO READ | రూ.2 లక్షల కోట్లతో 7 లక్షల మందికి ఉపాధి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయని.. విశాఖలో గూగూల్ పెట్టుబడులకు ముందుకు రావడమే ఇందుకు నిదర్శమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటున్నామని అన్నారు.  2025, జనవరి 8వ తేదీ ఏపీ చరిత్రలో చిరకాలం నిలిచిపోయే రోజు- అని.. 7 నెలల్లోనే రూ.2లక్షల కోట్ల పనులకు మోడీ శ్రీకారం చుట్టారని తెలిపారు. రూ.లక్షా 85వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్.. విశాఖ రైల్వేజోన్‌కు పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయన్నారు.