తిరుపతిలో తొక్కిసలాట.. నలుగురు భక్తుల మృతిపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర జరిగిన తోపులాటలో నలుగురు భక్తులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై  సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయిన చంద్రబాబు.. టోకెన్ల కోసం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ ఘటనలో గాయాలైన వారికి అందుతున్న చికిత్సపై అధికారులతో మాట్లాడి ఆరా తీశానని తెలిపారు. తిరుపతి జిల్లా, టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుంటున్నాని చెప్పారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 

ALSO READ | తిరుపతిలో నలుగురు భక్తులు మృతి.. తొక్కిసలాటకు కారణం ఇదేనా..?

తిరుమలలో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం బుధవారం (జనవరి 8) భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకరిని ఒకరిని తమిళనాడు సేలంకి చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. విష్ణునివాసం వద్ద టోకెన్ల జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురం పార్క్ ప్రాంతాల్లో కూడా తొక్కిసలాట జరిగింది.