ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చి స్వయంగా టీ పెట్టిన సీఎం చంద్రబాబు

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ స్కీమ్‎ను సీఎం చంద్రబాబు లాంఛనంగా  ప్రారంభించారు. 2024, నవంబర్ 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో పర్యటించిన చంద్రబాబు.. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని షూరు చేశారు. స్వయంగా చంద్రబాబే లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి ఫ్రీ గ్యాస్ సిలిండర్ అందజేశారు. గ్యాస్ పంపిణీ చేయడమే కాకుండా ఆయన చేతులతోనే స్టౌ వెలిగించి ఆయనే టీ పెట్టారు. అనంతరం టీ తాగుతూ లబ్దిదారులతో ముచ్చటించారు. ప్రభుత్వ పాలన గురించి, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే దానిపై చంద్రబాబు ఆరా తీశారు. అనంతరం ఈదుపురంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.

అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు సూపర్ సిక్స్ గ్యారెంటీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో దీపం పథకం ఒకటి. ఈ స్కీమ్ కింద అర్హులైన మహిళలకు నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మొత్తం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారు. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి రావడంతో.. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం దీపం పథకానికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. దీపం పథకంలో భాగంగా 2024, అక్టోబర్ 29వ తేదీ నుండే గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రాసెస్ మొదలు కాగా.. 2024, నవంబర్ 1న లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు.