అడ్రస్‌ దొరికితే టీడీపీ ఆఫీసును కూడా తాకట్టు పెట్టేవారు: సీఎం చంద్రబాబు

శుక్రవారం ( నవంబర్ 1, 2024 ) దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం కీలకనేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశంలో వైసీపీని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. కార్యకర్తల కృషితోనే టీడీపీ విజయం సాధ్యమైందని అన్నారు. గత పాలనలో ఏది దొరికితే అది కుదవపెట్టి అప్పుచేశారని... అడ్రస్‌ దొరికితే టీడీపీ ఆఫీసును కూడా తాకట్టు పెట్టేవారని అన్నారు.

టీడీపీ కార్యకర్తల మనోభావాలు అర్థం చేసుకొని పనిచేయాల్సి ఉందని అన్నారు. టీడీపీ పనిఅయిపోందన్న వాళ్ల పని అయిపోయిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు. గత ఐదేళ్ల వైపీసీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని... గత ఐదేళ్లు ఆరాచక పాలన కొనసాగిందని అన్నారు.

వైసీపీ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేశారని మండిపడ్డారు చంద్రబాబు. టీడీపీ పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిచామని.. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించామని అన్నారు. రాజీలేని పోరాటం చేసి రాష్ట్రాన్ని కాపాడామని అన్నారు సీఎం చంద్రబాబు.