సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత..

సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామూర్తి నాయుడు కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ( నవంబర్ 16, 2024 ) మరణించారు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం ఇవాళ విషమించి మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం చంద్రబాబు మధ్యాహ్నం 3 గంటలకు నారావారి పల్లికి రానున్నట్లు సమాచారం.

రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు స్వగ్రామం నారావారిపల్లిలో జరగనున్నట్లు సమాచారం. చిన్నాన్న రామ్మూర్తి నాయుడి ఆరోగ్యం విషమించిన సంగతి తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ శనివారం ( నవంబర్ 16, 2024 ) ఉదయం అసెంబ్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ కు చేరుకున్నారు. రామ్మూర్తి నాయుడి మరణ వార్త సీఎం చంద్రబాబు కుటుంబంలో విషాదం నింపింది. రామ్మూర్తి నాయుడి మరణం పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

నారా రామ్మూర్తినాయుడు 1952లో  నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలో ఒకరు హీరో రోహిత్‌ కాగా.. మరొకరు నారా గిరీష్. రామ్మూర్తి నాయుడు 1994లో చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత అనారోగ్య కారణాల దృష్ట్యా రాజకీయాలకు దూరమై ఇంటికే పరిమితమయ్యారు రామ్మూర్తి నాయుడు.