కోల్​కతాలో కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి

కోల్​కతాలో కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి
  • బీజేపీ లీడర్లను అడ్డుకున్న ఉన్నతాధికారులు
  • ఎక్కడికక్కడ అరెస్టులు
  • పోలీసు కారును తగులబెట్టిన ఆందోళనకారులు

కోల్​కతా : టీఎంసీ ప్రభుత్వం భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తూ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా బీజేపీ మంగళవారం చేపట్టిన చలో సెక్రటేరియట్​ ఉద్రిక్తంగా మారింది. కోల్​కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస జరిగింది. పోలీసులు, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. కోల్​కతాలో సెక్రటేరియట్​కు ర్యాలీగా వెళ్తున్న విపక్ష బీజేపీ  లీడర్​ సువేందు అధికారి, హుగ్లీ ఎంపీ లాకెట్​ చటర్జీ  సహా ఇతర నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అనంతరం వారిని వ్యాన్​లో వేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. వారితో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మార్చ్​లో పాల్గొన్నారు. ఈ క్రమంలో హౌరా బ్రిడ్జి వద్ద చేరుకున్న నిరసనకారులు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు టియర్​ గ్యాస్, వాటర్​ క్యానన్లు ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు. పలువురిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో ఆగ్రహం చెందిన నిరసనకారులు లాల్​బజార్​లో ఓ పోలీసు కారును తగులబెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాణిగంజ్​ పీఎస్​కు తరలించారు. ఈ ఘటనతో కోల్​కతాలో జనజీవనం స్తంభించింది. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేల మంది బీజేపీ కార్యకర్తలు కోల్​కతాకు తరలివెళ్లారు. 

ప్రశాంతంగా ప్రతిఘటిస్తం

ప్రజల్లో టీఎంసీకి వ్యతిరేకత పెరుగుతున్నదని, దీంతో ఆ పార్టీకి భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్​ ఘోష్​ అన్నారు. ‘‘మా నిరసన ర్యాలీని ప్రభుత్వం ఆపాలని యత్నించినా మేము ప్రశాంతంగా ప్రతిఘటిస్తం. జంగిల్​రాజ్​పై మా పోరాటం కొనసాగుతది. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తది” అని ఘోష్​ హెచ్చరించారు. మరో బీజేపీ నేత రాహుల్​ సిన్హా మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా తాము చేస్తున్న ర్యాలీని బలవంతంగా అడ్డుకునేందుకు మమత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. అలీపూర్​దౌర్​ నుంచి సెల్దాహ్​కు వెళ్లే స్పెషల్​ ట్రెయిన్​లో బీజేపీ సపోర్టర్లను ఎక్కనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారనిమండిపడ్డారు. అలాగే బీజేపీ కార్యకర్తలను తీసుకెళ్తున్న బస్సులను కూడా ఆపేశారన్నారు. సెక్రటేరియట్​ వైపు వెళ్లనివ్వకపోవడంతో ​బీజేపీ బెంగాల్​ అధ్యక్షుడు సుకాంతా మజుందార్​ హౌరాలో రోడ్డుపై బెఠాయించారు. విపక్ష నేతలు నిరసన తెలిపేందుకూ మమత సర్కారు అనుమతించడంలేదని ఆయన మండిపడ్డారు.

బెంగాల్​ను నార్త్​  కొరియాలా మార్చింది

పోలీసులు తనను లాక్కుపోయేట పుడు సువేందు అధికారి మాట్లాడుతూ బెంగాల్​ను సీఎం మమతా బెనర్జీ  నార్త్​ కొరియాలా మార్చారని ఫైరయ్యారు. ‘‘సీఎంకు ప్రజల మద్దతు లేదు. ఉత్తర కొరియా అధ్యక్షుడిలాగే మమత కూడా బెంగాల్​ను  నియంతలా పాొలిస్తున్నరు. ప్రశాంతంగా ర్యాలీ చేస్తున్న మా పార్టీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు. వారు చేసిందానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తది”  అని సువేందు అధికారి అన్నారు. 

బీజేపీ కార్యకర్తలా? గూండాలా?: టీఎంసీ

కోల్​కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న హింసకు బీజేపీదే బాధ్యత అని అధికార టీఎంసీ విరుచుకుపడింది. నిరసనలు, ర్యాలీల పేరుతో సాధారణ జనజీవనాన్ని బీజేపీ డిస్టర్బ్​ చేసిందని టీఎంసీ ప్రతినిధి కునాల్​ ఘోష్​ ఆరోపించారు. ‘‘ర్యాలీల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వారు బీజేపీ కార్యకర్తలా? గూండాలా? బెంగాల్​లో అశాంతి నెలకొల్పేందుకే వారిదంతా చేస్తున్నరు” అని కునాల్​ ఆరోపించారు.