రచ్చ రచ్చ .. ఇందిరమ్మ కమిటీల ఎంపికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లొల్లి

  • వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
  • తగ్గని కాంగ్రెస్ శ్రేణులు
  • తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు

సంగారెడ్డి, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల కోసం చేపడుతున్న కమిటీల ఎంపిక జిల్లాలో వివాదాస్పదమవుతోంది. అర్హుల కమిటీ పారదర్శకంగా కొనసాగుతోందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతుండగా, కమిటీల ఎంపిక వన్ సైడ్ గా జరుగుతోందని బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసుకుంటూ రచ్చ చేస్తున్నారు. దీనికి తోడు అధికారులు తయారు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కమిటీల ఏర్పాటును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తూ వారే సొంతంగా మరో జాబితా తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. 

కమిటీల్లో..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాల్లో, మున్సిపల్ వార్డుల్లో ఏడుగురి చొప్పున కమిటీని నియమించాల్సి ఉంది. గ్రామాల్లో సర్పంచులు లేనందున  ప్రత్యేక అధికారి కమిటీ అధ్యక్షుడిగా, గ్రామ కార్యదర్శి వార్డు కన్వీనర్ గా వ్యవహరిస్తారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో వార్డు కౌన్సిలర్ అధ్యక్షుడిగా, వార్డు ఆఫీసర్ కన్వీనర్ గా కొనసాగుతారు. ఆ తర్వాత ఐదుగురు సభ్యుల్లో ఇద్దరూ మహిళ సంఘాల సభ్యులు, మరో ముగ్గురు గ్రామ అభివృద్ధిని కాంక్షించే వారై ఉండాలి. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ వర్గాల వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలా పూర్తిచేసిన కమిటీ జాబితాను ముందుగా ఎంపీడీవోకు, ఆ తర్వాత కలెక్టర్ కు అందజేయాల్సి ఉంటుంది. 

నియోజకవర్గానికి..

నియోజకవర్గానికి 3,500 నుంచి 4 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో ఉన్న 5 అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా దాదాపు 20వేల ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ కానున్నాయి. ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఫండ్స్ అందజేస్తామని భరోసా ఇవ్వగా, స్థలం లేని పేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సహకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం చేపట్టే కమిటీలకు ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తూ పేదలకు ఇండ్లు రాకుండా చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.

ఆ గ్రామాల్లో గందరగోళం

జిల్లాలోని మునిపల్లి మండలం కంకోల్, భూసారెడ్డిపల్లి, మునిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల కమిటీల నియామకాల్లో గందరగోళం ఏర్పడింది. కమిటీ పూర్తిస్థాయిలో ఎంపిక కాకముందే సగం మంది లబ్ధిదారులను గుర్తించి జాబితా తయారు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించగా, ఆ పార్టీ లీడర్లు ఇచ్చిన పేర్లను కమిటీ జాబితాలో చేర్చకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

మరోవైపు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ఎంపిక ప్రజాభిప్రాయం మేరకు అధికారులు పారదర్శకంగా తయారు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే ఝరాసంఘం మండలంలో ఇందిరమ్మ కమిటీలను ఏకపక్షంగా ఎంపిక చేస్తున్నారని కమిటీలో కాంగ్రెస్ కార్యకర్తలకు చోటు కల్పిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఇటీవల నిరసనకు దిగారు. ఈ ఘటనపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం చర్చకు దారి తీసింది.