కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల  ఘర్షణ

  •     పోలీసు బందోబస్తు మధ్య వినాయకుడి నిమజ్జనం

శివ్వంపేట, వెలుగు: శివ్వంపేట మండలం పిలుట్ల గ్రామంలో  బుధవారం రాత్రి వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ  కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగి, ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.  పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య చెరువులో వినాయకుడిని నిమజ్జనం చేశారు. ప్రతిసారి మాదిరిగానే పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ  కలిసి కచీర్​లో  వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు.

బుధవారం నిమజ్జనం చేసేందుకు కార్యక్రమం సిద్ధం చేయగా, కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులను శాలువాలతో సన్మానించారు. ఇది చూసిన బీజేపీ కార్యకర్తలు మా పార్టీ నాయకులను కూడా సన్మానించాలని అనడంతో గొడవ మొదలైంది. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరి దాడులు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారగా పోలీసులకు గ్రామానికి చేరుకొని ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి, పోలీసుల బందోబస్తు మధ్య వినాయకుడిని నిమజ్జనం చేశారు. కాంగ్రెస్​, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసుకున్నారు.


కట్టెలు, రాళ్లతో దాడులు 


మండలంలోని బిజిలిపూర్ గ్రామంలో ప్రతిష్టించిన వినాయకుడిని బుధవారం రాత్రి ఆటపాటలతో నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకెళ్తున్న క్రమంలో యువకుల మధ్య గొడవ జరిగింది.  ఒకరిపై ఒకరు కట్టెలతో, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఇరువర్గాలకు చెందిన10 మంది యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.  పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.