నటుడు, వైసీపీ నేత పోసానిపై సీఐడీ కేసు..

ఏపీలో ప్రస్తుతం వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల పరంపర కొనసాగుతోంది. సోషల్ మీడియా ట్రోలింగ్ ను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్ గా అరెస్టులు చేపడుతోంది. ఈ క్రమంలో నటుడు, వైసీపీ కీలక నేత పోసాని కృష్ణమురళిపై సీఐడీ కేసు నమోదయ్యింది. సీఎం చంద్రబాబుపై ఉద్దేశపూర్వకంగా అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ పోసానిపై సీఐడీకి ఫిర్యాదు చేశారు తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ.

సెప్టెంబర్ నెలలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో పోసాని చంద్రబాబును ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని.. పోసాని వ్యాఖ్యలు సీఎం చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు వంశీకృష్ణ. అయితే.. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.

జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇదే టీడీపీ, జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో చేసిన ట్రోలింగ్ లు, మార్ఫింగ్ లు పట్టించుకోరా.. వారిపై కేసులు ఎందుకు పెట్టరు అంటూ పోలీసులను ప్రశ్నిస్తోంది వైసీపీ. పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి బానిసలా పనిచేస్తోందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆరోపిస్తోంది వైసీపీ.