పోలీస్ డ్యూటీ మీట్ లో కూతురికి సెల్యూట్ చేసిన తండ్రి

పోలీస్ డ్యూటీ మీట్ లో కూతురికి సెల్యూట్ చేసిన తండ్రి
తిరుపతిలో ఏపీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ డ్యూటీ మీట్ సందర్భంగా అరుదైన సన్నివేశం జరిగింది. డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న కూతురు జెస్సీ ప్రశాంతికి సీఐగా విధుల్లో ఉన్న ఆమె తండ్రి శ్యాం సుందర్‌ సెల్యూట్‌ చేశారు. తిరుపతికి చెందిన శ్యాంసుందర్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా కల్యాణి డ్యామ్ పోలీసు ట్రైనింగ్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె జెస్సీ ప్రశాంతి గుంటూరు డీఎస్పీ. రెండేళ్ల కిందట పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరిన ఆమె గుంటూరు అర్బన్ సౌత్ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇద్దరూ కూడా పోలీస్ డ్యూటీ మీట్ ఏర్పాట్లలో కన్పించి అందరినీ ఆకర్షించారు. కుమార్తె డీఎస్పీ కావడంతో ఆమెను తన పై అధికారిణిగా గుర్తించి తండ్రి సెల్యూట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. తండ్రి తనకు సెల్యూట్ చేయడంతో డీఎస్పీ హోదాలో ఉన్న జెస్సీ ప్రశాంతి తిరిగి సెల్యూట్ చేశారు.  అదే సమయంలో అక్కడే ఉన్న తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. కుమార్తెను డీఎస్పీ హోదాలో నిలిపిన సీఐ శ్యాంసుందర్ ను అభినందించారు.