ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేడుకలకు ముస్తాబైన చర్చిలు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం క్రిస్మస్‌‌ వేడుకలకు చర్చిలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. క్రిస్మస్​ పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో సెంటీనరీ బాప్టిస్ట్, నిర్మలమాతా, మన్నా, సీఎస్ఐ చర్చిలను అందంగా అలంకరించారు. నల్లగొండ పట్టణంలోని క్లాక్ టవర్ సర్కిల్ వద్ద సెంటినరీ బాప్టిస్ట్ చర్చి, దేవరకొండ రోడ్డులోని మరియమాతా, ఆర్టీసీ కాలనీలోని సౌతిండియా చర్చిలు విద్యుత్ లైట్లతో వెలిగిపోతున్నాయి. క్రైస్తవులందరూ చర్చిల్లో ప్రత్యేక పార్థనలు చేయనున్నారు. - 
వెలుగు నెట్​వర్క్​ 

ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు

హుజూర్ నగర్, వెలుగు : నేడు  ప్రపంచవ్యాప్తంగా జరిగే క్రిస్మస్ పండుగ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి రాష్ర్ట ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధించిన శాంతి, ప్రేమ, మానవత్వం అనుసరణీయమన్నారు. క్రీస్తు జన్మించిన పవిత్రమైన రోజుతో ప్రతిఒక్కరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు దేవుడి దయ ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నారు.