Christmas 2024 : మెదక్ చర్చి.. 10 ఏళ్ల నిర్మాణం.. మెతుకు సీమను అన్నంపెట్టి ఆదుకుంది..!

ప్రేమ, శాంతి సందేశాలను అందించే ఆరాధనా మందిరంగానే మెదక్ చర్చి గురించి తెలుసు. కానీ, ఈ చర్చి కట్టడం వెనక ఒక పెద్ద కథే ఉంది. ఎంతో మంది ఆకలి తీర్చింది ఈ కళాత్మక కట్టడం. మెతుకు సీమ కరువుతో కొట్టుమిట్టాడుతుంటే.. అన్నం పెట్టి ఆదుకుంది. పరమత సహనానికి ప్రతీకగా నిలిచిన ఈ మహా దేవాలయం ప్రస్తుతం క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది.

మెదక్. వెలుగు: మెదక్ చర్చి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతోంది. ఇక్కడికి క్రైస్తవులే కాకుండా ఇతర మతాల వాళ్లు కూడా వస్తుంటారు. క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ సుమారు లక్ష మంది వచ్చి ప్రార్ధనలు చేస్తుంటారు. అంతేకాకుండా ఈ చర్చికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడింది. ఇక్కడి ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం.

కరువు వల్ల పంటలు పూర్తిగా నష్టపోయి తినడానికి తిండి కూడా దొరకలేదు. చేసేందుకు పని లేదు. దాంతో కూలీలు, పేద రైతులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడే మెదక్ చర్చి నిర్మాణం మొదలుపెట్టారు. దాంతో అనేకమందికి పని దొరికింది. "పనికి ఆహారం' ప్రాతిపదికన ఈ చర్చిని నిర్మించారు. అప్పట్లో మెదక్ తోపాటు, రామాయంపేట, చిన్నశంకరంపేట, కొల్చారం, వెల్దుర్తి, కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, లింగంపేట మండలాలకు చెందిన ఎంతోమంది చర్చి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు.

సువార్త సేవకుడుగా వచ్చి

ఈ చర్చిని నిర్మిచింది చార్లెస్ వాకర్ ఫాస్నెట్. ఇంగ్లాండ్ లోని షఫిల్టు అనే నగరానికి చెందిన ఫాస్నెట్ సువార్త సేవలు అందించేందుకు 1895లో ఇండియాకు వచ్చాడు.. కొన్నాళ్లు మద్రాస్ లో ఉన్న తర్వాత సికింద్రాబాద్ కు వచ్చి తిరుమలగిరిలోని గ్యారోసిన్ చర్చిలో పనిచేశాడు. ఆ తర్వాత 1897లో మెదక్ లో మత బోధకుడు బర్లిన్ దొర నిర్మించిన చాపెల్ చర్చి ప్రచారకుడిగా బదిలీ అయ్యాడు. ఫాస్నెట్ అత్తామామలు అతడు ఉండేందుకు మెదక్ మిషన్ కాంపౌండ్లో రెండంతస్తుల భవనం కట్టించారు. ఒక రోజు సాయంత్రం ఫాస్నెట్ తన భవనంపై నడుస్తూ చర్చిని చూశాడు. తన ఇంటి కంటే చర్చి చిన్నగా ఉండడం అపచారంగా భావించాడు. అప్పుడే పెద్ద చర్చిని కట్టించాలని నిర్ణయించుకున్నాడు.

పదేళ్ల పాటు నిర్మాణం

చర్చి కట్టించేందుకు ఫాస్నెట్ ఇంగ్లాండ్ లోని తన మిత్రుడు ఇంజనీర్ బ్రాతో 200 మోడళ్లు గీయించాడు. కానీ అందులో నుంచి ప్రస్తుత చర్చి నమూనాను ఎంపిక చేశాడు. 1914లో ప్రారంభమైన ఈ చర్చి నిర్మాణం.. పనులు పదేళ్లు కొనసాగింది. రాళ్లు, దంగుసున్నం ఉపయోగించి 173 అడుగుల టవర్, 100 అడుగుల వెడల్పు, 200 అడుగుల పొడవుతో ఈ చర్చిని గోథిక్ శైలిలో నిర్మించారు. ఇందుకోసం దేశ, విదేశాలకు చెందిన ఎంతోమంది నిపుణులు పనిచేశారు. చర్చిలోపల ప్రార్ధన చేసేందుకు కట్టించిన హాలులో ఫ్లోరింగ్ కు తెలుపు, ఎరుపు, నలుపు రంగుల ఇటాలియన్. టైల్స్ వినియోగించారు: జెకోస్లోకియా దేశస్తులు. దేవదారు కర్రతో గద్ద రూపంలో తయారు. చేసిన బైబిల్ పఠన వేదిక అందరినీ ఆకట్టుకుంటోంది. రంగూన్ టేకుతో రూపొందించిన ప్రభు భోజనపు బల్ల, రోజ్ వుడ్తో తయారు చేసిన టేబుళ్లు, కుర్చీలు, దర్వాజాలు... అన్నీ ప్రత్యేకమే.

వావ్... గ్లాస్ విండోస్

చర్చిలో గ్లాస్ విండోస్ ప్రత్యేక ఆకర్షణ. లండన్ కు చెందిన కళాకారుడు ప్రాంక్ 'ఓ' సాలిస్ బరి చర్చిలో ఎత్తైన విండోస్ పై చిన్నచిన్న రంగుల స్టెయిన్లెస్ గ్లాస్ ముక్కలకు పేర్చి ఏసుక్రీస్తు జీవితంలోని ప్రధాన ఘట్టాలను రూపొందించాడు. చర్చిలో కుడివైపు ఉన్న కిటికీపై క్రీస్తు జననం, ఎడమవైపు ఉన్న కిటికీపై శిలువపై క్రీస్తు వేలాడుతున్న దృశ్యం, ఎదురుగా ఉన్న విండోపై క్రీస్తు ఆరోహణ దృశ్యాలు ఉంటాయి. బయట నుంచి సూర్యకాంతి పడినపుడు మాత్రమే ఈ కిటీకీలపై ఉన్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి.

సీఎస్ఐ్వ డయాసిస్ కేంద్రం

గతంలో ఈ చర్చి ప్రార్థనాలయంగా మాత్రమే ఉండేది. 1947లో చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) ఆవిర్భవించాక డయాసిస్ కేంద్రంగా మారింది. ఆ తర్వాత బిషప్ను నియమించడంతో కెథడ్రిల్ అయింది. మెదక్ డయాసిస్ పరిధిలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి. హైద్రాబాద్ జిల్లాలు ఉన్నాయి. సీఎస్ఐ ఆధ్వర్యంలో దయాసిస్ పరిధిలోని జిల్లాలో ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్లు, హాస్టళ్లు, క్రేమ్లు, ఓల్టేజ్ హోంలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ డయాసిస్ బిషప్ గా రైట్ రెవరెండ్ ఏ.సీ. సాల్మన్ ఉన్నారు.

వైభవంగా క్రిస్మస్ వేడుకలు

ప్రతి క్రిస్మస్ కి ఇక్కడ వైభవంగా వేడుకలు జరుగుతాయి. ఉత్సవాలకు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పర్యాటకులు మాత్రం ఏడాది పొడువునా చర్చిని చూసేందుకు వస్తుంటారు. ప్రార్థనల్లో పాల్గొని మత గురువుల ఆశీస్సులు తీసుకుంటారు. ప్రస్తుతం క్రిస్మస్ వేడుకలకు చర్చిని అందంగా అలంకరించారు. ఇక్కడ క్రిస్మస్ తర్వాత కూడా మూడు రోజుల పాటు రద్దీ ఉంటుంది.