BBL: జట్టు కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న కోచ్.. కారణం ఏంటంటే..?

సిడ్నీ థండర్‌ అసిస్టెంట్‌ కోచ్‌ డేనియల్‌ క్రిస్టియన్‌ తమ జట్టు కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని బిగ్ బాష్ లీగ్ లో బరిలోకి దిగాడు. క్రిస్టియన్‌ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం లేకపోలేదు. శుక్రవారం (జనవరి 3) పెర్త్ స్కార్చర్స్‌ తో జరిగిన మ్యాచ్ లో సిడ్నీ థండర్ స్టార్ ఆటగాళ్లు కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, డేనియల్ సామ్స్ గాయపడ్డారు. వీరి గాయం తీవ్రత కావడంతో అప్పటికప్పుడు హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం వీరు వేగంగా కోలుకుంటున్నారు. 

బాన్‌క్రాఫ్ట్, డేనియల్ సామ్స్ ఇద్దరూ తమ జట్టుకు స్టార్ ఆటగాళ్లు కావడంతో సిడ్నీ థండర్‌ కష్టాల్లో పడింది. దీంతో డేనియల్‌ క్రిస్టియన్‌  బిగ్‌బాష్‌ లీగ్‌ 2024-25లో బ్రిస్బేన్‌ హీట్‌ తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. తన కంబ్యాక్ ఈ వెటరన్ ప్లేయర్ అద్భుతంగా రాణించాడు.    బ్యాటింగ్ లో (15 బంతుల్లో 23 నాటౌట్‌; 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. బౌలింగ్ లోనూ ఒక కీలక వికెట్ పడగొట్టాడు. క్రిస్టియన్‌ చివరిగా 2022-23 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్‌ తరఫున ఆడాడు. 

ALSO READ : Ranji Trophy: దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే.. కోహ్లీ, రోహిత్ లపై మాజీ హెడ్ కోచ్ ఫైర్

ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే బ్రిస్బేన్‌ హీట్‌ 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్‌ పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సిడ్నీ థండర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ (36 బంతుల్లో 50; 7 ఫోర్లు) అర్ద సెంచరీతో రాణించాడు. 174 పరుగుల లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్‌ హీట్‌ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌ బ్రాయాంట్‌ (35 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు.