విజయవాడ: తెలుగు సినిమా, టీవీ షూటింగ్ లకు ఏపీ ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. తనను కలసిన తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులతో ఏపీలో షూటింగ్ లు జరుపుకునేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. టాలీవుడ్ తరపున చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, సి.కళ్యాణ్ తదితరులు ఇవాళ విజయవాడకు వెళ్లి సీఎం జగన్ ను కలిశారు. తెలంగాణ బాటలోనే ఏపీ ప్రభుత్వం కూడా షూటింగులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినీ ప్రముఖులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎంతో భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. జగన్ ను కలవాలని ఏడాదిగా అనుకుంటున్నా.. ఈరోజు కలిశా. కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేక ఇబ్బంది పడ్డాము.. ఇక్కడ కూడా అనుమతిచ్చారు. థియేటర్లలో మినిమం ఫిక్స్ డ్ చార్జీల విధానాన్ని ఎత్తివేయాలని కోరాము.. పరిశీలిస్తామన్నారు. ఇదే జరిగితే పారదర్శకత ఉంటుంది.. మాకు కూడా మేలు జరుగుతుందన్నారు. అలాగే నంది వేడుకలు పెండింగ్ లో ఉన్నాయి.. 2019-20కి అవార్డుల వేడుక జరుగుతుందని భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుండి మేము ప్రోత్సాహం కోరుకుంటున్నాము.. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి తాను సహరిస్తానని జగన్ చెప్పడం ఆనందం కలిగించిందన్నారు చిరంజీవి. విశాఖలో తెలుగు సినీ పరిశ్రమ ఏర్పాటుకు వైఎస్ ఆర్ హయాంలో 300 ఎకరాల భూమి ఇచ్చారని గుర్తు చేసుకున్న చిరంజీవి.. దానిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని స్పష్టం చేశారు.
