ఎలా వర్ణించాలి మిమ్మల్ని : జాతకాలు చూసి ఉద్యోగం ఇస్తున్న కంపెనీ.. కుక్క గుర్తు ఉంటే నో ఎంట్రీ

ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఏంటండీ.. అతనికి స్కిల్స్ ఉన్నాయా.. బాగా పని చేస్తాడా  లేదా.. ఇచ్చిన టార్గెట్ సమర్థవంతంగా పూర్తి చేస్తాడా లేదా.. ఆ ఉద్యోగం చేయటానికి కావాల్సిన అర్హతలు అన్నీ ఉన్నాయా లేదా.. ఇలాంటివి చూస్తారు.. ఇప్పుడు ఓ కంపెనీ మాత్రం జాతకాలు చూసి మరీ ఉద్యోగం ఇస్తుంది.. ఇదేమీ సిల్లీ మేటర్ కాదు.. సీరియస్ ఇష్యూ.. ఇప్పుడు చైనాలోని ఓ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ.. ఈ విధంగానే 100 ఉద్యోగాలు ఇచ్చింది.. ఈ విషయం సోషల్ మీడియాకు ఎక్కడటంతో.. చైనాలో రచ్చ రచ్చ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

చైనా దేశం గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని Sanxing Transportation అనే ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఉంది. 100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసింది. ఆ ఉద్యోగానికి కావాల్సిన అర్హత ఏంటో తెలుసా.. మీ జాతకంలో.. మీరు కుక్క గుర్తులో జన్మించి ఉండకూడదు.. అదేనండీ.. మనం 12 రాశులు అంటాం కదా.. అలాగే చైనాలోనూ 12 రాశులు ఉన్నాయి.. ఆ రాశులను 12 జంతువులతో పోల్చి చూస్తారు.. అలా కుక్క గుర్తు ఉన్న రాశిలో.. ఆ వ్యక్తి పుట్టి ఉండకూడదు అనే నిబంధన పెట్టింది. నిబంధన పెట్టటమే కాదు.. వారి వారి డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని.. ఆ కంపెనీ యాజమాన్యం జాతకాలు చూపించి మరీ.. ఉద్యోగాలు ఇచ్చిందంట.. 

ఇప్పుడు ఈ విషయం చైనాలో రచ్చ రచ్చ అవుతుంది. ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదంట.. కుక్క గుర్తులో జన్మించిన వారిని తీసుకుంటే మా కంపెనీకి అరిష్టం అని.. కంపెనీ నష్టపోతుందంటూ చెప్పుకొస్తుంది. అలాంటి వాళ్లను పెట్టుకుంటే మా కంపెనీకి కలిసి రాదని.. అందుకే ఉద్యోగంలో పెట్టుకోవటం లేదని తేల్చి చెప్పింది. మా కంపెనీ.. మా ఇష్టం.. మా కంపెనీ యాజమాన్యం జాతకాలు చూసి మరీ ఇలా డిసైడ్ అయినట్లు వెల్లడించింది. 

Also Read :- విమానాల్లో ఫారిన్ లిక్కర్

ఈ అంశంపై చైనాలోని ప్రముఖ లా కంపెనీ హుబే చిషెంగ్ లాయర్లు స్పందించారు. ఉద్యోగాన్ని జాతకం చూసి ఇవ్వటం అనేది వివక్షతో కూడుకున్నదని.. ఇలాంటి వాటిని సహించేది లేదని స్పష్టం చేసింది. అలా అని వ్యతిరేకించకపోవటం విశేషం. ఇది వ్యక్తిగత అంశానికి సంబంధించిన అంశం అని.. చట్టవిరుద్ధం అని కూడా చెప్పలేం అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. రాశి చక్రంలోని గుర్తులపై చైనీయుల్లో చాలా మందికి బలమైన విశ్వాసాలు ఉన్నాయని.. వాటిని నమ్మటం.. నమ్మకపోవటం అనేది ప్రజల విశ్వాసానికి సంబంధించిందిగా స్థానిక ప్రావెన్స్ అధికారులు వెల్లడించారు. దీనిపైనా విమర్శలు వస్తున్నాయి. 

మొత్తానికి చైనాలోని ట్రాన్స్ పోర్ట్ కంపెనీ ఇలా చేయటం చర్చనీయాంశం అయ్యింది. కుక్క గుర్తు జాతకం వాళ్ల బతుకు కుక్క బతుకేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక ప్రముఖంగా ప్రచురించటంతో వెలుగులోకి వచ్చింది.