యాంగ్జీ నదీ తీరంలో పెద్ద హార్బర్
అందులో పెద్ద పెద్ద బిల్డింగులు
నిదానంగా సాగుతున్న షిప్ బిల్డింగ్ పనులు
వచ్చే ఏడాది నాటికి షిప్ హల్ పూర్తి
శాటిలైట్ ఫొటోలను బయటపెట్టిన సీఎస్ఐఎస్
ఆర్మీలో నంబర్ వన్ చైనా. ఆయుధ సంపత్తిలోనూ అగ్రరాజ్యానికి దీటుగా టెక్నాలజీని పెంచుకుంటోంది. కానీ, నేవీకి వచ్చేటప్పటికి వెనకడుగులోనే ఉంది డ్రాగన్ దేశం. అందుకే అమెరికాకు పోటీ ఇచ్చేలా తొలి శక్తిమంతమైన ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్ (యుద్ధ నౌక) టైప్ 002ను తయారు చేసుకుంటోంది. అందు కోసం ఓ పెద్ద ఫ్యాక్టరీనే కడుతోంది. దాదాపు కట్టేసింది. స్పెషల్‌గా ఆ షిప్పు తయారీ కోసమే యాంగ్జీ నది తీరంలో జియాంగ్నన్ షిప్ యార్డును కట్టింది ఆ దేశం. పెద్ద పెద్ద బిల్డింగులను ఇప్పటికే కట్టేసింది. అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంటోంది. 2021 నాటికి టైప్ 002ను నేవీలోకి తీసుకోవాలని తాపత్రయపడుతోంది. ఆ షిప్పు బిల్డింగ్‌కు సంబంధించిన శాటిలైట్ ఫొటోలను సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (సీఎస్ఐఎస్) విడుదల చేసింది. గత నెల 18న ఆ ఫొటోలను తీసిన కంపెనీ, తాజాగా వాటిని బయటపెట్టింది. అంతేకాదు, గత ఏడాది ఏప్రిల్, సెప్టెంబర్‌లోనూ ఆ షిప్ నిర్మాణం తాలూకు ఫొటోలను సీఎస్ఐఎస్ విడుదల చేసింది.
నిమ్మలంగా…
చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు చాలా నిదానంగా నడుస్తున్నట్టు సీఎస్ఐఎస్ వివరించింది. ముందుగానే తయారు చేసి పెట్టిన భాగాలను షిప్ తయారీ ప్రాంతానికి డ్రాగన్ కంట్రీ చేర్చిందట. ఒక్క ఏడాదిలో దాని హల్ పూర్తయ్యే అవకాశం ఉందని అంటోంది. హల్ పూర్తవ్వగానే షిప్‌కు అటాచ్ చేసేలా హార్బర్‌కు తరలించే యోచనలో ఉందట చైనా నేవీ. యాంగ్జీ రివర్ హార్బర్లో ఇప్పటికే షిప్ బిల్డింగ్‌కు అవసరమైన వసతులను ఏర్పాటు చేసుకుంది డ్రాగన్ కంట్రీ. అందులో భాగంగా పెద్ద పెద్ద బిల్డింగులను కట్టింది. ఏడాది క్రితం పడావు పడిన పంట పొలాల జాగాను, ఇప్పుడు పూర్తి హార్బర్‌గా చైనా మార్చేసింది. ప్రస్తుతం అక్కడే ఉన్న ఇంకో హార్బర్, తాజాగా కట్టిన హార్బర్ కంటే చాలా చాలా చిన్నదని సీఎస్ఐఎస్ అంటోంది. ‘‘ఒక్క షిప్పు కోసం ఇంత పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడం ఆశ్చర్యం కలిగించేదే. షిప్పును నిర్మిస్తూనే దాని నిర్మాణం కోసం అవసరమైన వసతులను ఏర్పాటు చేసుకుంది. చెప్పాలంటే అదో పెద్ద షిప్ ఫ్యాక్టరీ అనొచ్చు” అని సీఎస్ఐఎస్ అనలిస్ట్ మాథ్యూ ఫునయోలి అన్నారు. ఉత్తర చైనాలోని డలియన్ షిప్‌యార్డ్‌లతో పోలిస్తే యాంగ్జీ హార్బర్ వద్ద రక్షణ ఉంటుందన్న ఉద్దేశంతోనే చైనా ఈ ప్రాజెక్టును అక్కడ చేపట్టి ఉంటుందని సింగపూర్‌కు చెందిన మిలటరీ అనలిస్ట్ కొలిన్ కో చెప్పారు.
ఇప్పటికే రెండు పెద్ద కారియర్లు
చైనా ఇటీవలే 4 టైప్ 055 క్రూయిజర్లు, ఒక పెద్ద హెలికాప్టర్ కారియర్‌ను నేవీలోకి తీసుకుంది. వాటి కన్నా పెద్దదైన టైప్ 002 గురించి మీడియాలో వార్తలు వస్తున్నా చైనా మిలటరీ మాత్రం అధికారికంగా స్పందించలేదు. అయితే, ఈ టైప్ 002, అమెరికా వద్ద ఉన్న సూపర్ కారియర్లతో పోలిస్తే చిన్నదేనంటున్నారు నిపుణులు. లక్ష టన్నుల సామర్థ్యం కలిగిన సూపర్ కారియర్ల కన్నా తక్కువ, 42,500 టన్నుల శక్తి ఉన్న ఫ్రాన్స్ చార్లీ డి గాలె కన్నా ఎక్కువ అని చెబుతున్నారు. అయితే, నేవీలో తన శక్తిని చాటేందుకే చైనా ఈ యుద్ధ నౌకను తయారు చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. టైప్ 002 తయారీకి ముందే నిర్మాణం ప్రారంభించిన టైప్001 క్లాస్ యుద్ధ నౌకలు కేవలం 25 వరకు యుద్ధ విమానాలను మాత్రమే డాక్ చేసుకుంటాయి. వాటి కన్నా మూడు నాలుగు రెట్లు ఎక్కువ యుద్ధ విమానాలను మోసుకెళ్లే సామర్థ్యంతో ఈ కొత్త దానిని కడుతున్నారట. ఈ టైప్001 యుద్ధ నౌకలకు సంబంధించి డలియన్ సముద్ర జలాల్లో ట్రయల్ రన్ జరుగుతోంది. ఆరింటిని 2030 నాటికి నేవీలో చేర్చాలని చైనా ఆరాటపడుతోంది.
