మన నేలపై చైనా ఊరు కట్టేసింది
అరుణాచల్ ప్రదేశ్‌లోకి 4.5 కిలోమీటర్లు చొచ్చుకొచ్చి నిర్మాణం
సుభాన్‌సిరి జిల్లాలో తారిచూ నది ఒడ్డున 101 ఇండ్లతో ఊరు
బార్డర్‌లో కదలికలన్నీ గమనిస్తున్నామన్న ఫారిన్ మినిస్ట్రీ
న్యూఢిల్లీ: చైనా మరోసారి బరితెగించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏకంగా ఓ గ్రామాన్నే నిర్మించింది. భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చి సుభాన్‌సిరి జిల్లాలో తారి చూ నది ఒడ్డున ఓ ఊరును కట్టేసింది. శాటిలైట్ ద్వారా తీసిన ఫొటోల ద్వారా ఈ విషయం వెల్లడైంది. చైనా నిర్మించిన ఆ ప్రాంతంలో 101 ఇండ్లున్నట్టు తెలిసింది. 2019 ఆగస్టు 26న తీసిన ఫొటోల్లో ఆ ప్రాంతంలో ఎలాంటి ఇండ్లు, నిర్మాణాలు కనిపించలేదు. తాజాగా గత నవంబర్ 1న తీసిన శాటిలైట్ ఫొటోల్లో ఇండ్లు నిర్మించినట్టు తెలిసింది. ఈ వివరాలన్నీ ఓ మీడియా చానల్ తాజాగా బయటపెట్టింది. సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్‌లోనూ ఇండియా భూభాగంలో చైనా గ్రామం ఉందని తెలుస్తోంది.
కిందటేడాది నవంబర్‌లోనే ఎంపీ తాపిర్ చెప్పినా..
అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా దురాక్రమణలపై అక్కడి బీజేపీ ఎంపీ తాపిర్ గావ్ లోక్‌సభలో కిందటి ఏడాది నవంబర్‌లోనే ప్రస్తావించారు. అప్పర్ సుభాన్‌సిరి జిల్లా గురించే ఆయన ప్రస్తావించారు. కొత్త గ్రామం విషయమై తాజాగా ఎంపీని ప్రశ్నించగా ఇప్పటికీ అక్కడ నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. సుభాన్‌సిరి ప్రాంతంలో సరిహద్దు నుంచి దాదాపు 60 నుంచి 70 కిలోమీటర్ల మేర మన భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందని, నది వెంబడి వెళితే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. స్థానికంగా లెన్సీ అని పిలిచే ఓ నది వెంబడి కూడా చైనా ఓ రోడ్డు నిర్మిస్తోందని వివరించారు.
అంతా గమనిస్తున్నం: ఫారిన్ మినిస్ట్రీ
చైనా కొత్త గ్రామంపై ఇండియన్ ఫారిన్ మినిస్ట్రీ స్పందించింది. బార్డర్ వెంబడి కదలికలను గమనిస్తున్నామని చెప్పింది. ‘సరిహద్దు దగ్గర చైనా అక్రమ నిర్మాణాలు చేపడుతోందని మా దృష్టికి వచ్చింది. గతంలోనూ అనేకసార్లు చైనా ఇలాంటి పనులు చేసింది’ అని కామెంట్ చేసింది. సరిహద్దుల్లో కొత్త గ్రామం విషయంపై చైనాను నిలదీస్తారా అని అడగ్గా.. బార్డర్ వెంబడి చైనా నిర్మాణాలను ఇండియా ఎప్పటికప్పుడు గమనిస్తోందని, ఇండియా సార్వభౌమత్వం దెబ్బతినే పరిస్థితి ఏర్పడితే అందుకు తగ్గట్టు చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇండియా కూడా బార్డర్ వెంబడి రోడ్లు, బ్రిడ్జిలు, ఇతర మౌలిక సదుపాయాలు పెంచుతోందని చెప్పింది. బార్డర్‌లో మిలటరీ కదలికలను కూడా పెంచామంది.
లైన్ దాటి రావొద్దని ఒప్పందాలున్నా..
చైనా నిర్మించిన గ్రామం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఏసీ)కు దక్షిణాన ఉందని, ఇది చాలాకాలంగా వివాదాస్పద ప్రాంతమని, సరిహద్దు లోని ఇతర ప్రాంతాలపైనా దీని ప్రభావం ఉంటుందని ఇండియా -చైనా వ్యవహారాల ఎక్స్‌పర్ట్ క్లాడ్ ఆర్పీ చెప్పారు. బార్డర్ గొడవలు సద్దుమణిగే వరకు ఎల్‌ఏసీకి కట్టుబడి ఉండాలని రెండు దేశాల మధ్య ఒప్పందాలున్నా యి. బార్డర్‌లో నివసించే వాళ్లకు ప్రాధాన్యమివ్వాలని ఈ ఒప్పందాలు చెబుతున్నాయి. కానీ చైనా మాత్రం వీటన్నింటినీ అతిక్రమిస్తోంది.
For More News..
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. 13 మంది మృతి
బీజేపీ మాఫియా పార్టీ.. బండి సంజయ్ అసలు హిందువేనా?
రాష్ట్రంలో రోజుకు లక్ష మందికి టీకా
రెండో ఏడాదీ అక్కరకు రాని కాళేశ్వరం ప్రాజెక్ట్
