గద్వాల జిల్లాలో పిల్లల కిడ్నాప్ ముఠా అరెస్ట్

  • హైదరాబాద్ నాంపల్లి పీఎస్ లో కేసు నమోదు
  • గంటల్లోనే చేధించిన 
  • గద్వాల జిల్లా పోలీసులు 

అలంపూర్,వెలుగు : పిల్లల కిడ్నాప్ ముఠాను పట్టుకుని గద్వాల జిల్లా పోలీసులు గంటల్లోనే కేసును చేధించారు.  వివరాల్లోకి వెళ్తే.. శనివారం రాత్రి హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్ లో 45 రోజుల పసి కందు కిడ్నాప్ అయినట్టు బాధితురాలు హసీనా నాంపల్లి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అయిన బాబుని హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు తీసుకెళ్తున్నారని గుర్తించారు. వెంటనే జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. 

జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉండవల్లి ఎస్ఐ మహేశ్, అలంపూర్ ఎస్ఐ వెంకట్ స్వామి, మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ సిబ్బందితో  నేషనల్ హైవే – 44 పై పుల్లూరు టోల్ గేట్ సమీపంలో అదేరోజు రాత్రి  పదిన్నర గంటల నుంచి వాహనాలతనిఖీ ముమ్మరం చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఓమ్ని వ్యాన్ లో ముగ్గురు చిన్నారులతో పాటు ముగ్గురు వ్యక్తులను, 20 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 చిన్నారుల్లో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడబిడ్డ ఉన్నారు.  కిడ్నాపర్లను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీసులకు అప్పగించినట్లు ఉండవల్లి ఎస్ఐ తెలిపారు. గద్వాల జిల్లా పోలీసులు 6 గంటల్లోనే కేసును చేధించగా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.