నాగర్ కర్నూల్లో పిల్లల కిడ్నాప్ యత్నం

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్  మున్సిపాలిటీ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన ఇద్దరు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్  చేసేందుకు యత్నించడం కలకలం రేపింది. గ్రామస్తులకథనం మేరకు.. గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బురఖా ధరించి ఆటోలో తిరుగుతున్నారు. ఆరో తరగతి చదువుతున్న సిద్దు, సుశాంత్ లను శుక్రవారం ఉయ్యాలవాడలో అద్దె ఇల్లు చూపించాలని బలవంతంగా ఆటో ఎక్కించుకున్నారు. 

తమకు అద్దె ఇళ్లు తెలియవని చెప్పినా వినలేదు. ఆటోలో ఇద్దరు మగవాళ్లు బురఖా ధరించి ఉన్నారని పిల్లలు చెప్పారు. గమనించిన సిద్దు తండ్రి ఆటో ఆపమని వెంబడించాడు. దీంతో ఆటో కొంచెం స్లో చేయగా, పిల్లలు ఆటోలో నుంచి కిందికి దూకారు. వెంటనే 100కు ఫోన్ చేయగా నాగర్ కర్నూల్  పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. గుర్తు తెలియని  వ్యక్తులు గ్రామానికి వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.