రాజకీయ సమర్థుడు, సాహసి రేవంత్ ముఖ్యమంత్రిగా కొలువుదీరి ఏడాది కావస్తున్న సందర్బంగా..

రాష్ట్ర రాజకీయాల్లో  సంచలన కెరటం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన రాజకీయ జీవితమంతా పోరాటమయమే. గ్రామీణ రాజకీయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ఆయన ఎదిగి వచ్చిన తీరు ఆసక్తికరంగా ఉంటుంది. రాజకీయాలో ఒదిగి  ఉండటం, ఓర్పుతో ఉండటం ఒక కీలకాంశంగా ఉంటుంది. రేవంత్ రెడ్డిది మాత్రం ఇందుకు భిన్నంగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఆయన ఒదిగి ఎదిగిన నాయకుడు కాదు.  ఎదిరించి ఎదిగిన  నాయకుడు.  అనతికాలం లోనే మహబూబ్ నగర్ జిల్లాలో  తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. రేవంత్ రెడ్డి   నాయకత్వ లక్షణాలను,  జ్ఞానాన్నీ ముందుగానే అంచనా వేసిన కేసీఆర్ ఆయనకు జడ్పీటీసీ టికెట్ నిరాకరించారు. అదే ఆయన రాజకీయ జీవితానికి కీలక మలుపుగా మారింది. టికెట్ రానంత మాత్రాన కుంగిపోలేదు. ఎదిరించాడు, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాడు. భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రజాభిమానం ఉన్న నేతకు పార్టీలు అవసరం లేదని నిరూపించాడు. 

పెద్ద యుద్ధమే చేశాడు..

గ్రామీణ ప్రాంత సాధారణ స్వతంత్ర  జడ్పీటీసీగా ప్రారంభమైన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం  రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేంతవరకు కూడా పెద్ద యుద్ధమే  చేశాడు.  రాజకీయాలు అంటే పార్టీలు, వారిచ్చే బీ ఫామ్ మాత్రమే అన్న సంప్రదాయాన్ని  రేవంత్  చేరిపేశారు.  ప్రజల్లో ఇమేజ్ ఉంటే చాలు ఓట్ల వర్షం కురుస్తుంది అన్న వాస్తవాన్ని ఆచరణలో పెట్టారు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రారంభమైన  రాజకీయ ప్రస్థానం జడ్పీటీసీ నుంచి స్థానికసంస్థల శాసన మండలి సభ్యుని వరకు పార్టీలకు అతీతమైనది. తాను శాసన మండలి సభ్యునిగా ఎన్నికైన తరువాత ఆయన తీసుకున్న నిర్ణయం కీలకం.  కేవలం తన పని విధానాన్ని, ఆచరణని  గీటురాయిగా నమ్ముకుని రేవంత్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. 

ఆయనకు సహజంగా ఉన్న పట్టుదల, మొండితనం దూకుడు స్వభావం  స్టార్​డమ్ ను తెచ్చిపెట్టింది.  తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ తన ప్రభను కోల్పోతూ ఉండడంతో తన కార్య క్షేత్రాన్ని కాంగ్రెస్ పార్టీకి బదిలీ చేసుకున్నాడు. 50 సంవత్సరాల సీనియార్టీ ఉన్న వృద్ధులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా రేవంత్ రెడ్డి మరో సాహసం చేయడమే.  రేవంత్ రెడ్డి దూకుడు స్వభావం ముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ఆయన  స్పీడును అందుకోలేకపోయారు. అనతి కాలంలోనే  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పీసీసీ ప్రెసిడెంట్​గా పదోన్నతి పొంది తెలంగాణ కాంగ్రెస్​లో  తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. చతురత, సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరు ఆయనను తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది.

తన చుట్టూ ఎన్ని వివాదాలు చెలరేగినా తన ఇమేజ్ ముందు అవన్నీ నిలబడలేకపోయాయి.  ముఖ్యమంత్రి పీఠాన్ని   అధిష్టించడం ఆయన రాజకీయ సమర్థకు గీటురాయిగానే భావించాలి. భిన్న భావజాలాలు,  భిన్న దృక్పథాలు ఉన్న పార్టీల నుంచి  వచ్చిన రేవంత్ రెడ్డి స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగివచ్చారు. ప్రణాళికాబద్ధమైన  పరిపాలన చేస్తూపోతే  మాత్రం ఆయనను ఎదుర్కొని నిలబడగలిగే నేత సమీప భవిష్యత్తులో ఉండరు.  పార్టీలపరంగా ఎంతటి దౌర్భాగ్యం ఉన్నా  నాయకుడి సమర్థతనే ఆయా పార్టీలను ప్రజల్లో నిలబెడుతుంది. ఆ విషయంలో రేవంత్​రెడ్డి నాయకత్వం కాంగ్రెస్​ పార్టీకి బాగా ఉపయోగపడింది.  గతంలో  కనీసం మంత్రిగా కూడా పనిచేయని  రేవంత్​రెడ్డి, ఏకంగా ముఖ్యమంత్రి కావడం, పరిపాలనలోనూ సమర్థంగా ముందుకు సాగడం ఆయన సామర్థ్యానికి కొలమానంగా భావించాలి.

- దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్