మహబూబ్‌నగర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు పర్యటనలో భాగంగా శనివారం రాత్రి అమిస్తాపూర్ వద్ద ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి వర్చువల్‌గా రూ.143.53 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పాలమూరులో ఉర్దూ ఘర్, షాదీఖాన, శ్మశానవాటికకు ప్రహరీ గోడ నిర్మాణానికి రూ.45 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో 25 బీటీ రోడ్లకు రూ.49.90 కోట్లు, తండాల నుంచి గ్రామాలకు వెళ్లే మట్టి రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు రూ.10.68 కోట్ల నిధులతో చేపట్టే పనులకు, మిడ్జిల్ నుంచి కొత్తపల్లి బీటీ రోడ్డును రెండు వరుసల రోడ్డుగా మార్చేందుకు రూ.25 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు.
పోతులమడుగు వద్ద రూ. 2.65 కోట్లతో నిర్మించిన మినీ స్టేడియాన్ని ప్రారంభించారు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని కేజీబీవీ అప్‌గ్రేడ్ కోసం రూ.3.25 కోట్లు, నందిన్నె కేజీబీవీకి రూ. 2.70 కోట్లు, గట్టు కేజీబీవీకి రూ. 2.05 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గద్వాల సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ స్టోర్, మెడికల్ కాలేజీని వర్చువల్‌గా ప్రారంభించారు. మూడు రోజులుగా అమిస్తాపూర్‌లో జరుగుతున్న రైతు పండుగ ముగియగా, సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కావడం ఉమ్మడి జిల్లా ప్రజలు, రైతులు, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.
Also Read :ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్లో బోనస్ సంబురం
పబ్లిక్‌తో నిండిపోయిన భూత్పూర్ రోడ్డు
‘రైతు పండుగ’ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. చివరి రోజు సభకు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రైతులను సమీకరించడంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు సక్సెస్ అయ్యారు.
30 ఎకరాల విస్తీర్ణంలో సభను ఏర్పాటు చేయగా, 60 వేల కుర్చీలను ఏర్పాటు చేశారు. అనుకున్న దానికంటే పబ్లిక్ ఎక్కువ రావడంతో కుర్చీలు సరిపోలేదు. దీంతో మరో 30 వేల మంది వరకు రోడ్లు వెంట.. సమీపంలో ఏర్పాటు చేసిన స్ర్కీన్లలో సీఎం స్పీచ్‌ను విన్నారు.ఈ క్రమంలో మహబూబ్‌నగర్–-భూత్పూర్ రోడ్డు పబ్లిక్‌తో నిండిపోయింది.