బ‌డుగుల‌ గ‌ళం పీజేఆర్‌ : సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్‌, వెలుగు: పేద ప్రజ‌లకు అన్ని వేళ‌లా అండ‌గా నిలిచి వారి తరఫున గళం వినిపించిన వ్యక్తి మాజీ మంత్రి పి.జ‌నార్దన్ రెడ్డి అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. పీజేఆర్ వ‌ర్ధంతిని పుర‌స్కరించుకొని ఆయ‌న చిత్రప‌టానికి సీఎం పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. 1994 నుంచి 1999 వ‌ర‌కు సీఎల్పీ నేత‌గా ప‌ని చేసిన ఆయ‌న నిత్యం ప్రజా స‌మ‌స్యల ప‌రిష్కారానికి పోరాడార‌ని కితాబిచ్చారు. తెలంగాణ వాదానికి బ‌ల‌మైన గొంతుక‌గా నిలిచార‌ని సీఎం తెలిపారు.

పీజేఆర్ అంటే పేరు కాదు బ్రాండ్: శ్రీధర్ బాబు 

పీజేఆర్ అంటే పేరు కాదు.. ఒక బ్రాండ్ అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. శనివారం పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ సర్కిల్ లోని ఆయన విగ్రహానికి  ప్రభుత్వం తరఫున శ్రీధర్ బాబు పూల మాల వేసి, నివాళి అర్పించారు. తర్వాత మాట్లాడుతూ పేదలు, కార్మికుల పక్షపాతిగా చివరి శ్వాస వరకు వారి కోసమే తపించారని కొనియాడారు. చివరి వరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమే శ్వాసగా బతికారు. కార్యక్రమం లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, పీజేఆర్ కుమార్తె విజయా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ చౌరస్తాలో మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ విగ్రహానికి పీసీసీ చీఫ్, మహేశ్ కుమార్ గౌడ్ పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.