సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేంద్ర న్యాయశాఖకు జస్టిస్ బోబ్డే లేఖ రాశారు. ఆయన వచ్చే నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆయనను కోరింది.సుప్రీంకోర్టులో జస్టిస్ బోబ్డే తర్వాత జస్టిస్ ఎన్వీ రమణ మోస్ట్ సీనియర్ జడ్జి. ఎన్వీ రమణ 2022, ఆగస్టు 26న రిటైర్ కానున్నారు.
ఎన్వీ రమణ 1957, ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో జన్మించారు. వారిది వ్యవసాయ కుటుంబం. 1983 లో లాయర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఆ తర్వాత 2000, జూన్‌లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు శాశ్వత జడ్జిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే ముందు ఢిల్లీ హైకోర్టు జడ్జిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.
జస్టిస్ బోబ్డే 2019 నవంబరులో సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ (రిటైర్డ్) రంజన్ గొగొయ్ స్థానంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పేరును ఆయన ప్రతిపాదించారు.
